వైసీపీ హయాంలో ఏపీలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు.. అదానీ లంచాలు ఇచ్చారా? అది కూడా వందల్లో కాదు.. వేలల్లోనే కోట్ల రూపాయలు చేతులు మారాయా? అంటే.. ఔననే అంటోంది అమెరికాకు చెందిన బ్రూక్లిన్ కోర్టుకు సమర్పించిన ఎఫ్ బీఐ నివేదిక. తాజాగా ఈ అభియోగాలు బయటకు వచ్చాయి. సెకీతో ఒప్పందాల వ్యవహారం అదాని మెడకు చుట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే హిండెన్ బర్గ్ నివేదికలు కూడా ఉన్నాయి.
గత రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై తాజాగా బ్రూక్లిన్ కోర్టులో ఎఫ్బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిలో 2021 నాటి ఏపీ ప్రభుత్వం పేరు కూడా ఉండడం గమనార్హం. అవినీతి సొమ్మును ఏపీలోకి కొందరు అధికారులకు అదానీ ఇచ్చారన్నది బ్రక్లిన్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు. అయితే.. ఎవరు ఎప్పుడు ఎక్కడ తీసుకున్నారనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచారు.
2021లో ప్రముఖ వ్యాపార వేత్తగా ఉన్న గౌతం అదానీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్తో భేటీ అయ్యా రు. పలుపోర్టులు, ఇతర వ్యాపారాల విస్తరణపై ఆయన అప్పటి సీఎంతో చర్చలు జరిపారు ఆ తర్వాతే సెకీ కుంభకోణం వెలుగు చూసింది. అంటే.. అప్పట్లోనే అధికారులకు అదానీ నుంచి పెద్ద ఎత్తున ముడు పులు అందినట్టు తెలుస్తోంది. ఇవి సుమారు 1750 కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంటున్నారు. ఇదేవిషయాన్ని ఎఫ్ బీఐ తన చార్జిషీట్లో పేర్కొంది.
అదానీ అరెస్టుకు డిమాండ్..
విదేశాల్లో పరువు తీస్తున్న అదానీని తక్షణమే మోడీ సర్కారు అరెస్టుచేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అసలు మోడీకి ఆ దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. విదేశీ గడ్డపై లంచాలు.. అక్రమాలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీకి వత్తాసుపలకడం సరికాదని ఆయన సూచించారు. మరోవైపు అమెరికాలో భారత అధికారులకు కూడా అదానీ లంచాలు ఇవ్వచూపారని తెలుస్తోంది.