రెజీనా.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న ముద్దుగుమ్మల్లో రెజీనా ఒకరు. `కొత్త జంట` మూవీతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన ఈ బ్యూటీ.. వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, టాలీవుడ్ లో స్టార్ హోదాను దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తున్న రెజీనా.. త్వరలోనే `శాకిని డాకిని` మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.
సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్ టైటిల్ పాత్రలను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించిన ఈ చిత్రం కొరియన్ మూవీ `మిడ్ నైట్ రన్నర్స్` కు రీమేక్. ఇందులో రెజీనా ఓసీడీ(అతి శుభ్రత)తో ఇబ్బంది పడే పాత్రను పోషిస్తే.. నివేదా ఫుడ్ లవర్ గా కనిపించబోతోంది.
కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తోన్న యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ఇది. అలాగే ఈ మూవీ ద్వారా సమాజానికి ఓ మంచి సందేశం కూడా ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 16న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే `శాకిని డాకిని` ప్రెస్ మీట్ మంగళవారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.
అయితే ఈ ప్రెస్ మీట్ లో రెజీనా కాస్త ఆగ్రహానికి గురైంది. అందుకు కారణం లేకపోలేదు. ఓ రిపోర్టర్ `ఈ సినిమాలో మీరు ఓసీడీతో ఇబ్బంది పడే పాత్రను పోషించారు కదా.. మరి నిజ జీవితంలోనూ మీకు అలాంటి వ్యాధి ఉందా..?` అని కామన్ గా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో రెజీనాకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో `సినిమాలో మేము కేవలం నటిస్తున్నామంతే. వ్యక్తిగతంగా నేను శుభ్రత ఇష్టపడే వ్యక్తిని. కానీ, ఓసీడీ లాంటి సైకలాజికల్ డిజార్టర్ ఏమీ నాకు లేదు. అయినా ఈ ప్రశ్నను నన్ను అయితే అడగగలిగారు కానీ.. ఇలా ఓ హీరోని అడగ్గలరా..?` అంటూ సదరు రిపోర్ట్ పై రెజీనా మండిపడింది.
ఏదో సరదాగా అడిగిన ప్రశ్న ఇది. ఇలాంటి ప్రశ్నలకు సెలబ్రెటీలు అంతే సరదాగా సమాధానం ఇచ్చేస్తుంటారు. కానీ, రెజీనా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో.. ఇప్పుడీ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ విషయంపై కొందరు నెటిజన్లు రెజీనా చాలా ఓవర్ చేసిందంటూ కూడా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. రెజీనా అడిగిన దాంట్లో తప్పేం ఉందంటూ ఆమెను సపోర్ట్ చేస్తున్న వారు లేకపోలేదు.