చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగిన కేరళ కుట్టి నివేదా థామస్.. తాజాగా మీడియా ముఖంగా నాకు పెళ్లైపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన భర్త కూడా అందరికీ పరిచయం అయింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.. నివేదా థామస్ కు పెళ్లి జరిగింది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ చిన్నది ఒక సినిమాలో యాక్ట్ చేసింది. అదే `35- చిన్న కథ కాదు`.
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ కామెడీ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్ ఓ సాధారణ సగటు గృహిణి పాత్రలో నటిస్తే.. విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజాగా మేకర్స్ 35- చిన్న కథ కాదు మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
అయితే 35- చిన్న కథ కాదు సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో ఇటీవల నివేదా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెళ్లికి రిలేటెడ్‌గా ఉండటంతో నివేదా త్వరలోనే ఓ ఇంటిది కాబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ లో పెళ్లి వార్తలపై నివేదా థామస్ స్పందించింది.
`నా పెళ్లి వార్తలు చూసి మా అమ్మ ఆశ్చర్యపోయింది. మాకు తెలియకుండా నీకు పెళ్లి ఎప్పుడైందని అడిగింది. అవును నాకు పెళ్లైంది. ఇతనే నా భర్త.. వాళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్` అంటూ సినిమాలో తనకు జోడిగా నటించిన విశ్వదేవ్ మరియు పిల్లలను ఉద్ధేశిస్తూ నివేదా సరదాగా కామెంట్స్ చేశారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.