ప్రముఖ హీరోయిన్ హన్సిక చిక్కుల్లో పడింది. ఆమెపై పోలీసు కేసు నమోదు అయ్యింది. సొంత తమ్ముడి భార్యే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన హన్సిక ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. 2022లో వ్యాపారవేత్త సొహైల్ కతూరియాను ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం ఓవైపు సినిమాలు మరోవైపు బుల్లితెర షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతుంది.
ఇదిలా ఉంటే.. బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ అత్తారింటి వేధింపులు తాళలేక పోతున్నానంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇంతకీ ముస్కాన్ మరెవరో కాదు హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ సతీమణి. 2021 మార్చిలో ప్రశాంత్, ముస్కాన్ పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లై ఏడాది తిరక్క ముందే వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రెండేళ్లుగా ప్రశాంత్, ముస్కాన్ విడి విడిగా ఉంటున్నారు. అయితే గత కొంత కాలం నుంచి సోషల్ మీడియా వేదికగా అత్తారింటి వారిపై ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేసిన ముస్కాన్.. గత ఏడాది డిసెంబర్ 18న ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో గృహ హింస చట్టం కింద అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక, భర్త ప్రశాంత్ తనను మానసికంగా హింసిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.
అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక తన జీవితంలో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని.. వారి వల్లే తన భర్తకు, తనకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ముస్కాన్ ఫిర్యాదులో పేర్కొంది. తన కాపురంలో హన్సికతో పాటు ఆమె తల్లి చిచ్చు పెట్టారని.. ఖరీదైన బహుమతులు, డబ్బు కట్నం కింద డిమాండ్ చేస్తున్నారని తెలిపింది. తనను మానసికంగా, శారీరకంగా చాలా రోజులు హింసించారని.. అది తీవ్రమైన ఒత్తిడికి దారి తీసి, బెల్ పాల్సీ రావడానికి కారణమైంది ముస్కాన్ తెలిపింది. ముస్కాన్ ఫిర్యాదుతో పోలీసులు ప్రశాంత్, హన్సిక, జ్యోతి లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ఈ కేసు గురించి హన్సిక నోరు విప్పలేదు.