వెండితెర మీద వెలిగిపోయే తారల వెనుక జీవితాలు మాత్రం చీకట్లో ఉండిపోతుంటాయి. అలాంటి వారికి సంబంధించిన కొన్ని ఉదంతాలు బయటకు వచ్చినప్పుడు విస్మయానికి గురి అవుతుంటారు. వెండితెర మీద తన అందంతో కోట్లాది మందిని నిద్ర లేకుండా చేసే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. రీల్ లైఫ్ కు పూర్తి భిన్నంగా రియల్ లైఫ్ లో మాత్రం ఆమె పెద్ద స్కాంలో ఇరుక్కోవటమే కాదు.. వందల కోట్లు ముంచేసిన వ్యక్తితో డేటింగ్ చేస్తున్న వైనం.. సదరు వ్యక్తి చేసిన నేరంలో ఆమె భాగస్వామ్యం కూడా ఉందన్న ఆరోపణలు పెను సంచలనంగా మారటం తెలిసిందే.
జాక్వెలిన్ బాయ్ ఫ్రెండ్ సుఖేష్ చంద్రశేఖరన్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కోవటం.. అప్పట్లో ఆమెకు కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు ముగిసిన నేపథ్యంలో ఆమె ఈ రోజు (గురువారం) ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. రెగ్యులర్ బెయిల్ తో పాటు.. పెండింగ్ అప్లికేషన్ మీదా కోర్టు విచారణ చేపట్టింది. గతంలో ఆమె అరెస్టు చేయకుండా ఉండేందుకు వీలుగా నవంబరు 10 వరకు మధ్యంతర బెయిల్ జారీ చేయటం తెలిసిందే. ఈ బెయిల్ గడువు ఈ రోజుతో ముగుస్తుంది.
ఇక.. విచారణలో భాగంగా కోర్టు నుంచి అనూహ్యమైన వ్యాఖ్య ఒకటి వచ్చింది. జాక్వెలిన్ ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రశ్నించింది న్యాయస్థానం. ఇదిలా ఉంటే.. ఆమెకు బెయిల్ గడువు పెంచొద్దని.. ఒకవేళ పెంచిన పక్షంలో ఆమె సులువుగా దేశాన్ని విడిచి పెట్టే వీలుందన్నారు. ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్య చేశారు. తాము జీవితకాలంలో రూ.50 లక్షలు కూడా చూడలేమని.. .కానీ.. జాక్వెలిన్ మాత్రం తన విలాసాల కోసం రూ.7 కోట్ల మేర ఖర్చు పెడుతుందని ఈడీ పేర్కొంది.
ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు జైల్లో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. ఆమెను ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించింది. బెయిల్ గడువును పెంచే దరఖాస్తు మీద తీర్పును రేపటికి వెలువరిస్తామని పేర్కొంటూ వాయిదా వేసింది. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.