హైదరాబాద్ మహానగరంలో దొంగతనాలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంతో పోలిస్తే ఇపుడు సీసీటీవీ సర్వేలైన్స్ నిఘా పరిధి పెరగడం…ప్రజల్లో కూడా అప్రమత్తత పెరగడంతో దొంగతనాలు కాస్తంత తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు.
అయితే, ఎప్పటికపుడు అప్డేట్ అవుతున్న దొంగలు… ఇటీవలి కాలంలో కొత్త పంథాలో, కొత్త ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నగరంలో ప్రముఖులు నివసించే బంజారా హిల్స్ ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతూ కలకలం రేపుతున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో నటి షాలూ చౌరాసియాపై దాడి చేసి సెల్ ఫోన్ దొంగిలించిన ఘటన కలకలం రేపుతోంది.
ఆదివారం రాత్రి 8.30 సమయంలో వాకింగ్ చేసేందుకు కేబీఆర్ పార్క్ వద్దకు వచ్చిన చౌరాసియా వద్ద ఉన్న నగలు, నగదు, ఫోన్ ఇవ్వాలని దొంగ బెదిరించాడు. అయితే, ఆమె ఇవ్వకుండా తిరగబడడంతో…మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో చౌరాసియాపై అతడు బండరాయితో దాడి చేయగా ఆమె తల, కళ్లకు గాయాలయ్యాయి.
చుట్టుపక్కల వాకింగ్ చేస్తున్నవారు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి నుంచి పరారయ్యాడు.
చౌరాసియా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గాయపడిన చౌరాసియాను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో దారి దోపిడీ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయని, పోలీసుల నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
అయితే, నిత్యం ప్రముఖుులు, సెలబ్రిటీలు వాకింగ్ కు వచ్చే కేబీఆర్ పార్క్ లో ఈ తరహా ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలున్నాయి.
అంతేకాకుండా, పార్కులో కొందరు పోలీసులు కూడా కాపలా కాస్తూ ఉంటారు. అయినప్పటికీ, ఈ దొంగతనం ఘటన జరగడం చర్చనీయాంశమైంది.