ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీటీడీలో అనేక వ్యవహారాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీటీడీ ఆస్తుల వేలం మొదలు రమణ దీక్షితులు నియామకం వరకు ఎన్నో నిర్ణయాలు దుమారం రేపాయి. టీటీడీ అధికారుల తీరు కూడా బాగోలేదని భక్తులు పలు మార్లు విమర్శలు గుప్పించారు. టీటీడీపై గతంలో సినీనటి నమిత సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
టీటీడీ అధికారులు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నమిత…భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ప్రస్తుతం పరిపాలన బాగోలేదని, గతంలో ఉన్న అధికారి నేతృత్వంలో పరిపాలన బాగుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా మరో సినీ నటి…టీటీడీపై సంచలన ఆరోపణలు చేశారు. సినీ నటి, కాంగ్రెస్ నేత అర్చనా గౌతమ్ టీటీడీ అధికారులపై షాకింగ్ కామెంట్లు చేశారు.
వీఐపీ దర్శనం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.10,500 వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని అర్చనా డిమాండ్ చేశారు. తాను డబ్బులు చెల్లించినా రసీదు ఇచ్చి టోకెన్ ఇవ్వలేదని, దర్శన టోకెన్ కోసం ప్రశ్నిస్తే టీటీడీ సిబ్బంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. తనతో టీటీడీ సిబ్బంది దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని కన్నీటిపర్యంతమయ్యారు.
మరోవైపు, అర్చన ఆరోపణలను టీటీడీ ఖండించింది. టీటీడీ ఉద్యోగులపై అర్చనే దాడి చేశారని ప్రత్యారోపణలు చేసింది. అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేశారని టీటీడీ చెబుతోంది. రూ.10,500 టికెట్ తో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలని సూచించామని, కానీ, దర్శనం కోసం రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారని వెల్లడించింది.
అర్చన బుక్ చేసుకున్న స్లాట్ ను వినియోగించుకోకపోవడంతో ఆ గడువు ముగిసిందని, ఈ నేపథ్యంలోనే అర్చనా గౌతమ్, శివకాంత్ తివారీ ఇష్టంవచ్చినట్టు మాట్లాడి ఓ ఉద్యోగిపైనా చేయిచేసుకున్నారని టీటీడీ ఆరోపించింది. అధికారులపై ఆరోపణలు చేస్తూ అర్చన కన్నీటి పర్యంతమై విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.