అమలా పాల్.. ఈ పేరు ఎప్పుడూ ఒక సంచలనమే. మామతో శారీరక సంబంధం పెట్టుకునే అమ్మాయిగా అరంగేట్ర సినిమాలో వివాదాస్పద పాత్ర చేయడం ద్వారా తమిళనాట తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ఈ అమ్మాయి.. అలాంటి సినిమా తర్వాత మంచి మంచి పాత్రలతో స్టార్ హీరోయిన్గా ఎదగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక కెరీర్ మంచి ఊపులో ఉండగా, చిన్న వయసులోనే దర్శకుడు ఎ.ఎల్.విజయ్ను పెళ్లాడటం ఇంకో సెన్సేషన్.
రెండేళ్లు తిరక్కుండానే అతడి నుంచి విడిపోవడం ఇంకో షాక్. పెళ్లి విఫలమయ్యాక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ తన సత్తా చాటి తన పూర్వపు స్థానాన్ని ఆమె దక్కించుకుంది. గత కొన్నేళ్లలో ఆమె చాలా వరకు మంచి మంచి సినిమాలే చేసింది. ఆడై (తెలుగులో ఆమె) పేరుతో ఓ బోల్డ్ ఫిలిం కూడా చేసింది. ఆ సినిమాలో ఆమె నిర్మాణ భాగస్వామి కూడా కావడం విశేషం.
ఐతే ఇప్పుడు అమల పూర్తి స్థాయి నిర్మాతగా కూడా మారింది. అమలా పాల్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను మొదలుపెట్టింది. కడవర్ పేరుతో తనే లీడ్ రోల్ చేస్తూ ఓ బహుభాషా చిత్రం చేస్తోంది అమలా. అనూప్ పానికర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బేసిగ్గా ఇది మలయాళం మూవీ. అక్కడ థ్రిల్లర్ సినిమాలు బాగా తీస్తారన్న సంగతి తెలిసిందే. కడవర్ ఓ ఫోరెన్సిక్ థ్రిల్లరట. ఇందులో అమలా పోలీస్ సర్జన్ కమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర చేస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ స్టన్నింగ్గా తీర్చిదిద్దారు. ఫోరెన్సిక్ రూంలో శవాలు, రక్తపు మరకల మధ్య అమలా కూర్చుని భోజనం చేస్తున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ తీర్చిదిద్దారు. అమలా ఇలాంటి థ్రిల్లర్లో లీడ్ రోల్ చేయడం.. ఆ చిత్రాన్ని తనే స్వయంగా నిర్మించడం విశేషమే. అమలా చాలా బోల్డ్ అని చెప్పడానికి ఇది మరో రుజువు. చూద్దాం మరి నిర్మాతగా ఆమె ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో?