హాస్య నటుడు కమ్ రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి పద్మ (48) అనారోగ్యంతో కన్నుమూశారు. గడిచిన కొంతకాలంగా ఆమె క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.
ఈ రోజు ఉదయం (సోమవారం) ఆమె బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వారికి ఇద్దరు కుమార్తెలు (చేతన.. పాట).
ఉత్తేజ్ కు చెందిన మయూఖ ఫిలిం స్కూల్ బాధ్యతల్ని ఆమె నిర్వహిస్తుండేవారు. అంతేకాదు.. ఉత్తేజ్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో ఆమె పాలు పంచుకునే వారు. ప్రతి పనిలోనూ ఆమె వెంట ఉండేవారు. ఉత్తేజ్ సతీమణి మరణ వార్త తెలిసినంతనే మెగాస్టార్ చిరంజీవి ఆసుపత్రికి వెళ్లారు. చిరంజీవిని చూడగానే ఉత్తేజ్ కన్నీరు మున్నీరు అయ్యారు.
పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశ్ రాజ్.. జీవిత.. బ్రహ్మాజీ.. తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఉత్తేజ్ ను పరామర్శించారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆమె అంత్యక్రియల్ని మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.