టాలీవుడ్ నటుడు శివాజీ గురించి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర లేదు. గతంలో హీరోగా, ఆ తర్వాత మంచి నటుడిగా శివాజీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గరుడ పురాణం అంటూ 2019 ఎన్నికలకు ముందు రాజకీయాలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. పరోక్షంగా సీఎం జగన్ పై దాడి జరుగుతుందని దాడికి కొద్ది నెలల ముందే శివాజీ హింట్ ఇచ్చారు. శివాజీ చెప్పినట్లే జరగడంతో అంతా అవాక్కయ్యారు. అయితే, 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి, జగన్ సీఎం అయిన తర్వాత శివాజీ కొంతకాలం అమరావతి రైతులకు కూడా మద్దతిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కూడా శివాజీ గళమెత్తారు.
కానీ, అనూహ్యంగా ఆ తర్వాత ఇటు సినిమాలకు, అటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక, ఇటీవల తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న శివాజీ, ఆ తర్వాత ‘90’s: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’తో తెలుగు ప్రేక్షకులకు, ఆంధ్రా ప్రజలకు మరోసారి చేరువయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా శివాజీ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనవంటి వారు రాజకీయాలకు పనికి రారని, తాను రాజకీయాలకు సెట్ కానని శివాజీ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే, నటుడిగా కొనసాగుతానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారి గొంతుక అవుతానని చెప్పారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసమే గతంలో తాను పోరాడానని, ఆ విషయంలో సంతోషంగా ఉన్నానని అన్నారు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజలు, నాయకులు కలిసి ఉంటున్నారని చెప్పారు. నిజాలు మాట్లాడతాననే అందరికీ తాను కంటు అయ్యానని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ భాగం కాలేదని, వాటితో తనకు సంబంధం లేదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తనను ఏదైనా రాజకీయ పార్టీకి ఆపాదిస్తే కచ్చితంగా ఆ పార్టీలోనే చేరతానని, అందరి పని చెబుతానని, అందుకే తన జోలికి రావొద్దని హెచ్చరించారు. టీడీపీ మద్దతుదారుడు అని శివాజీపై గతంలో కొందరు ముద్ర వేసిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.