గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే పోటీలో నిలవాలని గట్టిగా కోరుకున్నాడు కమెడియన్ ఆలీ. తనకు టికెట్‌తో పాటు గెలిచాక మంత్రి పదవి ఇచ్చే పార్టీలో చేరతానని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఐతే జనసేనలో లేదా టీడీపీలో చేరతాడనుకున్న ఆలీ.. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాడు. టికెట్ రాకపోయినా ఆ పార్టీకి ప్రచారం చేశాడు.
వైసీపీ ఫస్ట్ టర్మ్ చివర్లో ఆయనకో సలహాదారు పదవి దక్కింది. అందులో కొనసాగుతూనే సినిమాల్లో నటిస్తున్నాడు, టీవీ షోలు కూడా చేస్తున్నాడు. సీఎం జగన్ పోటీ చేయమంటే ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తా అని కొన్ని రోజుల కిందట ప్రకటించాడు ఆలీ. కానీ ఆయనకు టికెట్ రాలేదు. కాగా అవకాశం వచ్చినా ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయొద్దంటూ ఆలీకి సీనియర్ నటుడు శివాజీ సలహా ఇవ్వడం విశేషం.
ఆలీ నిర్వహించే ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన శివాజీ.. రాజకీయాల్లో తన అనుభవాల గురించి మాట్లాడాడు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆ రంగంలో కొనసాగడం చాలా కష్టమని అతనన్నాడు. చివర్లో నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా అని ఆలీని శివాజీ అడగ్గా.. ఇంకేంటి సంగతులు అంటూ ఆలీ సమాధానం దాటవేశాడు. అనంతరం శివాజీ స్పందిస్తూ.. ‘‘నేనైతే నువ్వు పోటీ చేయడానికి ఒప్పుకోను.
రాజకీయాల్లో పదేళ్లు గ్రౌండ్ లెవెల్లో తిరిగిన అనుభవం ఉంది. రాజకీయాల్లో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. పెట్టిన డబ్బులు వెనక్కి లాక్కొనే సత్తా నీకుండాలి. తీసుకోవడం ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే ప్రకృతి వనరులు దోచుకోవాలి. ఇసుక, మట్టి, రకరకాల పథకాల్లో వచ్చే డబ్బులు జనాలకు వెళ్లకుండా తీసుకోవాలి. అది నీ వల్ల కాదు. నీకు పెట్టడమే వచ్చు. తీసుకోవడం తెలియదు. నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం పని చెయ్యి. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకు’’ అని శివాజీ స్పష్టం చేశాడు.