టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు ఖండించారు. చంద్రబాబు ప్రజల సొమ్ముకు కక్కుర్తి పడే రకం కాదని, ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం తపన పడే వ్యక్తి అని కొనియాడారు. అటువంటి విజన్ ఉన్న నాయకుడిని ఆధారాలు లేకుండా అక్రమ కేసులతో జైల్లో ఉంచి హింసిచడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు సహజమేనని, కానీ, 73 ఏళ్ల వయసులో చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన ఎత్తుగడో అర్థం కావడం లేదన్నారు.
ఏ పవర్ ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టించారో, అదే పవర్ తో ఆయనను వదిలేయాలని కోరారు. జైలులో కాకుండా విడుదల చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు విచారణ చేసుకోవాలని అన్నారు. చంద్రబాబును వదిలేస్తే జాలి, విలువ, మనసు ఉన్న వ్యక్తులుగా చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుందని జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుల పవర్, సినిమా వాళ్ల గ్లామర్ శాశ్వతం కాదని హితవు పలికారు. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలు తమ కుటుంబానికి ఆప్తులని, చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ పని చేయాలన్నా వంద యాంగిల్స్ లో, వందసార్లు ఆలోచిస్తారని, అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.