తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును హీరో అల్లు అర్జున్ మరచిపోయారన్న కారణంతోనే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయనను అరెస్టు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కామెంట్లను రేవంత్ రెడ్డి ఖండించారు. ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో టాలీవుడ్ నటుడు రేవంత్ రెడ్డి పేరు మరచిపోవడం షాకింగ్ గా మారింది.
ప్రపంచ తెలుగు సమాఖ్య మహా సభ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించే క్రమంలో నటుడు బాలాదిత్య….సీఎం రేవంత్ రెడ్డి పేరు మరచిపోయారు. సీఎవ రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన పేరుకు బదులు కిరణ్ కుమార్ అంటూ నోరు జారారు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేయడంతో బాలాదిత్య తాను టంగ్ స్లిప్ అయ్యానని గుర్తించారు.
ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. ఆ వెంటనే మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి అని ఆహ్వానించారు. కానీ, అప్పటికే డ్యామేజీ జరిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినీ నటులకు సామాజిక బాధ్యత కొంతైన ఉండాలని, తమ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఎలా మరచిపోతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే బాలాదిత్యపై సెటైర్లు వేస్తున్నారు.