నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసిపి అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి తోడుగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాప్ అయిందంటూ ఆరోపణలు చేయడంతో వైసిపి దిక్కుతోచని స్థితిలో పడింది. ఇక, టీడీపీతో కోటంరెడ్డి టచ్ లో ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారని ఆడియో కాల్ లీకైప నేపథ్యంలో వైసిపి అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది.
నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని తాజాగా జగన్ నియమించడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై సజ్జల అధికారికంగా ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ రూరల్ ఎమ్మెల్యే టికెట్ ను ఆదాలకు కన్ఫర్మ్ చేశామని, అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారని కూడా సజ్జల స్పష్టం చేయడం షాకింగ్ గా మారింది. అయితే, సీఎం జగన్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని సజ్జల చెప్తున్నారు. దీంతో, పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన కోటంరెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసినట్లయింది.
ఇక, తనను ఇంచార్జిగా నియమించడంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఆదాల అన్నారు. ఇక, రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టికెట్ ను టీడీపీ తరఫున తనకు కేటాయించాలని చంద్రబాబును కోటంరెడ్డి కోరారని, ఆ విధంగా కోటంరెడ్డికి హామీ కూడా చంద్రబాబు ఇచ్చారని బాలినేని సంచలన ఆరోపణ చేశారు. చంద్రబాబుతో చాలాకాలంగా కోటం రెడ్డి టచ్ లో ఉన్నారని, ఆయనతో భేటీ తర్వాతే ఫోన్ ట్యాపింగ్ గురించి కోటంరెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆదాల ఆధ్వర్యంలోనే ఇకపై జరుగుతాయని చెప్పారు.