టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొంతకాలంగా ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసేందుకు లోకేష్ హస్తిన వెళ్లారు. అయితే, ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసేందుకే లోకేష్ వెళ్లారని, చంద్రబాబు కేసుల గురించి మాట్లాడేందుకు ఆయన అక్కడ తిష్ట వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కూడా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అరెస్టులకు భయపడే లోకేష్ ఢిల్లీలో ఉంటున్నారని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు ఖండించారు. తాము తప్పులు చేయమని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అచ్చన్న అన్నారు. అవివేకులు మాత్రమే అలా వ్యాఖ్యానిస్తారని చెప్పారు. న్యాయవాదులతో చంద్రబాబు కేసుల గురించి మాట్లాడేందుకే ఆయన ఢిల్లీలో ఉన్నారని అన్నారు. ఇక దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీలోని జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను వివరించేందుకే ఢిల్లీలో లోకేష్ ఇన్ని రోజులు ఉన్నారని చెప్పారు.
త్వరలోనే అనుమతులు తీసుకున్న తర్వాత యువగళం పాదయాత్ర పునః ప్రారంభమవుతుందని చెప్పారు. ఈరోజు రాజమండ్రి జైల్లో భువనేశ్వరి, బ్రాహ్మణిలతో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అయిన అచ్చం నాయుడు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టారని, సంబంధం లేకుండా 33 ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. జనసేనతో ఉమ్మడి కార్యచరణ రూపొందించి ముందుకు సాగాలని చంద్రబాబు తనతో చెప్పారని అచ్చన్న అన్నారు. చంద్రబాబు జైల్లో ధైర్యంగా పోరాటపటిమతో ఉన్నారని అన్నారు. చంద్రబాబు సలహాలు సూచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.