ఏపీలో వన్ టైం సెటిల్మెంట్ అంటూ జగన్ నయా ధందాకు తెరతీసిన సంగతి తెలిసిందే. 40 సంవత్సరాలుగా మరుగున పడి ఉన్న వ్యవహారాన్ని సొమ్ము చేసుకోవాలని జగన్ సర్కార్ భావించింది. ఖజానా నింపుకునేందుకు చేపట్టిన ఈ పైసా వసూల్ కార్యక్రమానికి ముద్దుగా ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం అని పేరు పెట్టి మరీ వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కింద వసూళ్లు చేశారు. ఇక, జగన్ తన పుట్టినరోజు నాడే ఈ వసూల్ రాజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి డబ్బా కొట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. తన పుట్టినరోజు నాడు పేదల రక్తాన్ని పీల్చే కార్యక్రమాన్ని జగన్ మొదలుబెట్టారని, జగన్ నోరు తెరిస్తే అమ్మడం అనే పదం తప్ప మరో మాట రావడం లేదని ఎద్దేవా చేశారు. తన జన్మదినం సందర్భంగా ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారని దుయ్యబట్టారు. ఓటీఎస్ పై జగన్ కు ఏం హక్కుందని ప్రశ్నించారు.
5 ఏళ్లలో 32 లక్షల ఇళ్ళు కడతామని చెప్పిన జగన్.. 30 నెలల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఎద్దేవా చేశారు. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో 7.52 లక్షల ఇళ్ళు కట్టింది వాస్తవం కాదా..?అని ప్రశ్నించారు. జగన్ ఇచ్చే ఇంటి పట్టా చెల్లుబాటు కాదని, 5 వేల కోట్ల దోపిడీ కోసమే ఓటీఎస్ అంటూ సెటిల్మెంట్ మొదలుబెట్టారని విమర్శించారు. 32 లక్షల ఇళ్లు ఎప్పుడు, ఎలా కడతారో చెప్పాలని నిలదీశారు. పుట్టిన రోజునాడు కూడా జగన్ నిజం మాట్లాడలేదని సెటైర్లు వేశారు.
పేదలపై జగన్ కు నిజంగా ప్రేముంటే ఉచితంగా ఓటీఎస్ చేయాలని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసిస్తామని అన్నారు. ఓటీఎస్ కట్టకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తున్నారని, ఇది దారుణమని అన్నారు. పాలన బాగోలేదని సొంత పార్టీ వాళ్ళు చెప్పినా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న దాడికి గురైన గుప్తాను పిచ్చివాడన్నారని, ఈ రోజు మంత్రి పిలిచి కేక్ పెట్టారని ఎద్దేవా చేశఆరు. వైసీపీ దరిద్రపు పాలన ఎప్పుడు అంతమవుతుందా అని జనం ఎదురు చూస్తున్నారని విమర్శించారు.