పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు తెరతీసిన వైసీపీ అదే పంథాను మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బలవంతంగా టీడీపీ అభ్యర్థులను వైసీపీలో చేరాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు వైసీపీలో చేరేలా అధికార పార్టీ నేతలు బలవంతం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కౌన్సిలర్లను చేర్చుకున్నా… బలవంతంగా పార్టీ మారేలా చేసినా వైసీపీకి ఓటమి తప్పదని అచ్చెన్న జోస్యం చెప్పారు. అధికార బలంతో ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని, పలాసలో వైసీపీ నేతలను రబ్బరు చెప్పులతో తరమడం ఖాయమని హెచ్చరించారు. పలాసలో మంత్రి అరాచకాలకు.. మున్సిపల్ ఎన్నికలే చెంపపెట్టని అచ్చెన్నాయుడు అన్నారు.
కాగా, ప్రజా మద్దతుతో నియంతలకు గుణపాఠం చెప్పేలా కొత్తవలసలో టీడీపీ విజయం సాధించిదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు రౌడీయిజం చేస్తే తాట తీస్తామని పట్టాభిరామ్ వార్నింగ్ ఇచ్చారు. చెప్పే విధంగా కొత్తవలస నిలబడిందన్నారు. పోలీస్, అధికారంతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడికి తలొంచిన అధికారులు న్యాయస్థానం ముందు తలదించుకోక తప్పదని పట్టాభిరామ్ తెలిపారు.