అమరావతి రాజధానిగా ఉండాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర 2.0 చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైంది. కోర్టు అనుమతితో అమరావతి రైతులు దిగ్విజయంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. దీంతో, రైతుల మనోస్థైర్యం దెబ్బతినేలా పాదయాత్రపై వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు.
ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించగా…తాజాగా పాదయాత్రను మంత్రి బొత్స ఘోరంగా అవమానించారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడానికి తనకు ఐదు నిమిషాలు చాలు అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పాదయాత్రను అడ్డుకుంటామంటూ బొత్స వంటి నేతలు వ్యాఖ్యానించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే బొత్స వ్యాఖ్యలపై ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయవేత్త, టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. రాష్ట్రం ఏమైనా నీ జాగీరా అంటూ బొత్సను అచ్చెన్న ప్రశ్నించారు. రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులు తమ హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్నారని, అటువంటి పాదయాత్రపై మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని అచ్చెన్న మండిపడ్డారు.
అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అచ్చెన్న సందేహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను ప్రభుత్వం అభివృద్ధి చేయొద్దా? అది ప్రభుత్వం బాధ్యత కాదా అని వైసీపీ నేతలు చెబుతున్నారని ఆయన అన్నారు. ‘‘దద్దమ్మల్లారా….ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తే వద్దని ఎవరంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? చంద్రబాబు వద్దంటున్నారా? అచ్చెన్నాయుడు వద్దంటున్నారా? చెప్పండి’’ అని అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి, జనాన్ని తప్పుదోవ పట్టించడానికి మూడు రాజధానులు అంటూ వైసీపీ నేతలు పాత పాటే పాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ఉన్న కాస్త అభివృద్ధిని కూడా నాశనం చేశారని మండిపడ్డారు. విశాఖలో ప్రకృతి ఇచ్చిన రుషికొండను ధ్వంసం చేస్తున్నారని, ఉత్తరాంధ్ర భూములను కొట్టేయడానికి వైసీపీ నేతలు డ్రామాలాడుతున్నారని అచ్చెన్న ఆరోపించారు.