ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతూనే ఉన్నాయి. రెండో రోజు సభలోను అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెరిగిన చార్జీలు, పన్నులపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దాంతో పాటు కడప స్టీల్ ప్లాంట్ పై కూడా వాదనలు జరిగాయి. అయితే, అందుకు స్పీకర్ తమ్మినేని సీతారం నిరాకరించారు. దీంతో, పోడియంవైపు టీడీపీ సభ్యులు దూసుకుపోయారు. ఆ అంశంపై చర్చ జరపాలని తమ్మినేని సీతారాంను టీడీపీ సభ్యులు కోరారు.
దీంతో, యథావిధిగా ఈ రోజు కూడా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయమని బుగ్గన సిఫారసు చేయడం..తమ్మినేని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ అనంతరం మీడియా పాయింట్ దగ్గర టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్, వైసీపీ సభ్యులపై మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం విభజన చట్టంలో కూడా ఉందని అచ్చెన్న చెప్పారు. విభజన హామీల సాధనలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
జగన్ వందలసార్లు ఢిల్లీ వెళ్లారని, బుగ్గన అయితే ఏకంగా ఢిల్లీలోనే ఉంటున్నారని అచ్చెన్న ఎద్దేవా చేశారు. కానీ, వారిద్దరూ రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేని ఈ ప్రభుత్వం పరిశ్రమలపై చర్చ పెట్టడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. తన సొంత జిల్లా కడపకు జగన్ పరిశ్రమలు తీసుకురాలేకపోయారని విమర్శించారు. కానీ, సిగ్గు, ఎగ్గు లేకుండా సభలో పారిశ్రామిక విధానంపై జగన్ చర్చ పెట్టడం టైం వేస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేతగాని జగన్ సర్కార్ కరోనాపై నెపం మోపుతోందని మండిపడ్డారు. చేతకాని అసమర్ధులే ఇలా కుంటి సాకులు చెబుతారని విమర్శించారు. చంద్రబాబు వంటి సమర్ధులైన నాయకులు ఎన్ని ఆటంకాలు వచ్చినా చేపట్టిన పనులను పూర్తి చేస్తారని అన్నారు.