ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరైన సందర్భంగా హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. తన లాయర్ ను తనతోపాటు లోపలికి అనుమతించకపోవడంతో విచారణకు హాజరుకాకుండానే కేటీఆర్ వెనుదిరిగారు. ఈ క్రమంలోనే ఈ నెల 9న మరోసారి విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులిచ్చారు. 9వ తేదీ విచారణకు కూడా లాయర్ ను అనుమతించబోమని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
మరోవైపు, తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగే చాన్స్ ఉందని, తన ఇంట్లో ఏదో ఒకటి పెట్టి కుట్ర పన్నుతున్నారు అని కేటీఆర్ ఈ రోజు ఉదయం ఆరోపించారు. ఆయన అన్నట్లుగానే తాజాగా ఈ రోజు సాయంత్రం గచ్చిబౌలిలో ఉన్న ఓరియన్ విల్లాస్లోని కేటీఆర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తాను లేనప్పుడు తన ఇంట్లో ఏసీబీ సోదాలు చేయాలని చూస్తోందని, తనపై కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఈ రోజు ఉదయం షాకింగ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కావాలని ఏదైనా తన ఇంట్లో పెట్టి అది దొరికినట్లు చూపించి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఏసీబీ సోదాల తర్వాత కేటీఆర్ ఇంట్లో ఏమైనా దొరుకుతాయా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
మరోవైపు, ఈ కేసు నేపథ్యంలో భారీ స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రూ.41 కోట్ల విలువైన బాండ్లను గ్రీన్ కో సంస్థ ఇచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు రూ. 49 కోట్లు 41 దఫాలుగా బీఆర్ఎస్ కు చందాల రూపంలో ఇచ్చిందని ఆరోపిస్తున్నారు.