ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణకు కేటీఆర్ తరఫు లాయర్ ను కేటీఆర్ తోపాటు లోపలికి వెళ్లేందుకు పోలీసులు, ఏసీబీ అధికారులు అనుమతించలేదు. కోర్టు లాయర్ ను అనుమతించమని చెప్పలేదని ఏసీబీ అధికారులు..అనుమతించకూడదు అని ఎక్కడుందో చూపించాలని కేటీఆర్ తరఫు లాయర్లు పరస్పరం వాదనలకు దిగారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగారు.
ఏసీబీ అధికారులకు లిఖితపూర్వక సమాధానమిచ్చి అక్కడి నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అయితే, కేటీఆర్ కు మరోసారి నోటీసులివ్వాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోన ఏసీబీ అధికారులపై కేటీఆరక్ సంచలన ఆరోపణలు చేశారు. తన లాయర్ ను ఎందుకు అనుమతించరి ఏసీబీ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. రాజమౌళి కన్నా బాగా కథలు చెబుతున్నారని సెటైర్లు వేశాచు.
పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లుగా పోలీసులు చెప్పారని, తనకు కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. తన ఇంటిపై ఏసీబీతో దాడులు చేయించాలని చూస్తున్నారని, ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని చూస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే, లాయర్ ఉంటేనే విచారణకు హాజరవుతానని కేటీఆర్ అన్నారు. ఆనాడు మంత్రిగా నిర్ణయం తీసుకున్నానని, ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. కావాలని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ కేసులో తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కేటీఆర్ చెప్పారు.
ఇక, లాయర్ ను కేటీఆర్ తన వెంట తీసుకువెళ్లడం రాజ్యాంగ బద్దంగా ఆయనకు సంక్రమించిన హక్కు అని, చట్టాలు రాజ్యాంగానికి లోబడే ఉంటాయని కేటీఆర్ తరఫు న్యాయవాది సోమ భరత్ మీడియాతో చెప్పారు. మరి, రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.