జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు డీహైడ్రేషన్, స్కిన్ ఎలర్జీతో అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఉక్కపోత, వేడిమి వల్ల చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని, ఆయన సెల్ లో చల్లదనం ఉండేలా ఏర్పాటు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో, చంద్రబాబు సెల్ లో ఏసీ ఏర్పాటు చేయాలని, మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు తరఫు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు చంద్రబాబు సెల్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఆన్లైన్ ద్వారా ఆ పిటిషన్ విచారణ జరిపిన కోర్టు అత్యవసరంగా ఏసీ ఏర్పాటుకు ఆదేశించింది.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనారోగ్యం గురించి వైద్యులు చెప్పినా..ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల తర్వాత కూడా వైద్యుల సూచనలు అమలు చేయకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి డీ హైడ్రేషన్ బారిన పడ్డారని, ఆయన సెల్ లో చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు సూచించినా ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. లోకేష్ ప్రశ్నలకు డీఐజీ సమాధానమివ్వకుండా ములాఖత్ సమయం అయిపోయిందంటూ దురుసుగా వ్యవహరించారని లోకేష్ విమర్శించారు.