రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును రోజుకు రెండు సార్లు ఆయన తరఫు న్యాయవాదులు ములాఖత్ కావొచ్చని.. దీనిలో తప్పేముంది.. అని విజయవాడలోని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది. రోజుకు రెండు సార్లు కలవడం తప్పుకాదని.. న్యాయవాదులు ఏమీ ఇతరత్రా విషయాలు చర్చించరు కదా? అని కూడా వ్యాఖ్యానించింది. చంద్రబాబును రోజుకు రెండు సార్లు కలుసుకునేందుకు కోర్టు అనుమతి ఇస్తోందని తెలిపింది. ఈ మేరకు జైలు అధికారులు చర్చలు తీసుకోవాలని సూచించింది.
ఇటీవల చంద్రబాబుపై ఏపీ సర్కారు పెడుతున్న కేసుల నేపథ్యంలో ఆయనను తరచుగా ఆయన తరఫు న్యాయవాదులు కలుసుకుంటున్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లోని కేసుల విషయాలు, బెయిల్ వంటి అంశాలపై వారు చర్చించి … తదనుగుణంగా కోర్టుల్లో కేసులు ఫైలు చేస్తున్నారు. వాదనలు కూడా వినిపిస్తున్నారు. అయితే.. ఈ ములాఖత్‌లపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు నిర్బంధం విధించారు. రోజుకు ఒక్కసారి మాత్రమే న్యాయవాదులు.. చంద్రబాబుతో ములాఖత్ కావాలని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో జైలు అధికారుల నిర్ణయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో 3 ములాఖత్‌లు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి 2 ములాఖత్‌లకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్ట్ ఆదేశాలు పంపించింది. ఇదేసమయంలో చంద్రబాబును ఆయన తరఫు న్యాయవాదులు కలుఉకుంటే తప్పేమీ లేదని కోర్టు వ్యాఖ్యానించింది.