ఎంతటి వారైనా కావొచ్చు.. భార్యకు భర్తే అవుతారు. పిల్లలకు తండ్రి అవుతాడు. వ్యక్తిగతంగా చూస్తే ఒక సాధారణ జర్నలిస్టు స్థాయి నుంచి తాను పని చేసిన మీడియా సంస్థకు అధినేతగా మారటం.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల్లో కీలక భూమిక పోషించారని చెప్పాలి.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆంధ్రజ్యోతి రాధాక్రష్ణ పాత్రను తక్కువ చేసి చూపలేం.చాలామంది ఆయన పాత్రను తప్పు పడతారు కానీ.. తెలంగాణ విషయంలో మొదట్నించి క్లియర్ కట్ పాలసీని తెలియజేయటమేకాదు.. రాష్ట్రం రెండు ముక్కలు కానుందన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన వ్యక్తి ఆర్కే.
మొండితనం.. అంతకు మించిన గడుసుదనం.. విషయం ఏదైనా సూటిగా.. సుత్తి కొట్టకుండా చెప్పేయటమే కాదు.. ఎంతటి తీవ్రమైన ఒత్తిడినైనా సరే.. ఇట్టే తట్టుకునే తత్త్వం ఆర్కేలో కనిపిస్తుంది.
ఆయన మీడియా సంస్థ పొలిటికల్ పాలసీ గురించి చర్చించటం లేదు కానీ.. ఆయన తానేం అనుకున్నా చేయటమే కాదు.. ఆయనతో పెట్టుకొని (వాదన విషయంలో) గెలిచినోళ్లు ఇప్పటివరకైతే లేదని చెప్పాలి.
అలాంటి గట్టి మనిషి తాజాగా చోటు చేసుకున్న విషాదంతో ఆయన కంట కన్నీరు కారింది. ఎప్పుడు గంభీరంగా ఉండటంతో పాటు.. ధీమాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. తన జీవితభాగస్వామి.. సుదీర్ఘంగా తనతో పాటు ప్రయాణించిన కనకదుర్గ అనారోగ్యంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వేళ.. ఆయన తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు.
కరోనా కారణంగా ఆయన ఇంటికి పరిమిత స్థాయిలోనే ప్రముఖులు వచ్చారు. పలువురు సంతాప సందేశాలు పంపారు. విడి రోజుల్లో అయితే.. హడావుడి చాలానే ఉండేది. కరోనా నేపథ్యంలో చాలా ముఖ్యమైన వారు తప్పించి మరెవరూ రాలేదు.
అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన తన సతీమణి భౌతికకాయాన్ని.. ఇంటి హాలు మధ్యలో ఉంచటం ద్వారా.. ఆమె పట్ల తనకున్న ప్రేమాభిమానాలు ఎంతన్న విషయాన్ని తెలియజేశారు. అయితే.. దీనికి మరో కారణం ఉందని చెబుతారు.
ఇప్పుడున్న ఇంటిని ఆర్కే సతీమణి దగ్గరుండి తన అభిరుచికి తగ్గట్లు కట్టించారని చెబుతారు.ఈ కారణంతోనే.. ఆమెకు ఎంతో ఇష్టమైన ఇంట్లో.. ఆమె భౌతికకాయాన్ని ఉంచాలని నిర్ణయించినట్లు చెబుతారు.
అంతిమయాత్రకు వెళ్లే వేళలో అప్పటివరకు గంభీరంగా ఉన్న ఆర్కే భావోద్వేగానికి గురైనట్లు చెబుతారు. ఇక.. మహాప్రస్థానంలో దహన సంస్కారాలు జరిగే సమయంలో ఆయన కంట వస్తున్న కన్నీరును ఆపుకోలేకపోయారు.
దీర్ఘకాలం జీవితభాగస్వామిగా నిలిచిన వ్యక్తి.. ఇక ఎప్పటికి రారన్న వాస్తవం గుండెను పిండేయటం.. దాని తాలుకూ బాధను ఆపుకునే ప్రయత్నం చేసినప్పటికి ఆర్కే విఫలమయ్యారని చెప్పాలి.