దిగ్గజ నిర్మాత రామానాయుడు మనవడు.. సురేష్ బాబు తనయుడు.. రానా దగ్గుబాటి తమ్ముడు అయిన అభిరామ్ దగ్గుబాటి ఇప్పటిదాకా మీడియాలోకి ఎప్పుడూ నెగటివ్ వార్తలతోనే వచ్చాడు.
అతడిపై అప్పట్లో నటి శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎంత సంచలనం రేపాయో తెలిసిందే. తర్వాత మరో నటి అతను ఓ సినిమా షూటింగ్ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపించింది.
అతడి రాష్ డ్రైవింగ్ గురించి కూడా మీడియాలో కొంత చర్చ జరిగింది. ఐతే ఆ ఆరోపణలు, ప్రతికూల వార్తలన్నీ తర్వాత సద్దుమణిగాయి.
ఇప్పుడు అభిరామ్ తెరంగేట్రం గురించి వార్తలొస్తున్నాయి. సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో చేయబోయే సినిమాతో అతను హీరోగా పరిచయం కాబోతున్నాడు.
ఈ నేపథ్యంలో అతను మీడియాతో మాట్లాడాడు. తన తెరంగేట్రం గురించే కాక.. తనపై గతంలో వచ్చిన ఆరోపణల గురించి కూడా అతను స్పందించాడు.
అందరూ తప్పులు చేస్తుంటారని.. ఐతే తాను చేసిన తప్పులు మాత్రం బయటికి వచ్చాయని.. ఈ పరిణామాల నుంచి తాను పాఠాలు నేర్చుకున్నానని అభిరామ్ అన్నాడు.
తన గురించి మీడియాలో ప్రచారం జరిగినపుడు తన కుటుంబం అండగా నిలిచిందని.. ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదనే విషయం తనకు అప్పుడే అర్థమైందని అభిరామ్ చెప్పాడు.
తాను మారానని.. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టడానికి ముందే ఇలా జరగడంతో భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకూడదని అర్థమైందని అతనన్నాడు.
ఇక తన తొలి సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా సమయంలో తేజ పనితీరు ఎలా ఉంటుందో అర్థమైందని.. అప్పుడే తనను హీరోగా పరిచయం చేయాలని ఆయన్ని అడిగానని అభిరామ్ చెప్పాడు.
తప్పకుండా నీ కోసం కథ రాస్తా అని చెప్పిన తేజ.. తర్వాత నిజంగానే కథ రాసి తన తండ్రికి చూపించారని.. ఆయనకు నచ్చడంతో తేజ దర్శకత్వంలోనే తన అరంగేట్రం జరగబోతోందని అభిరామ్ తెలిపాడు.