అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆత్మహత్యపై దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలీ ఈ పిటిషను వేశారు. షేక్ ఖాజావలి తరపున మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు.
ఇది చాలా తీవ్రమైన పరిణామం అని, మానవ హక్కుల ఉల్లంఘన ఘోరంగా జరిగిందని… సీబీఐతో ఈ కేసును దర్యాప్తు చేయించాలని పిటిషనులో కోరారు.ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏపీ డీజీపీ, విశాఖ సీబీఐ ఎస్పీ. కర్నూల్ ఎస్పీ, నంద్యాల డీఎస్పీ, నంద్యాల వన్ టౌన్ ఎస్సైలను చేర్చారు. ఆటో డ్రైవర్ అయిన అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి సామూహిక ఆత్మహత్య చేసుకుంది.
నేను తప్పు చేయలేదు అని, చేయని తప్పు నాపై వేసి చోరీ కేసు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని, మేము ఇక బతకలేం అని అబ్దుల్ సలాం కుటుంబం వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇచ్చి బలవన్మరణానికి పాల్పడింది. ఆ వీడియో చంద్రబాబు నాయుడు షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
చంద్రబాబు దీనిని వెలుగులోకి తెచ్చి వారి తరఫున పోరాటం చేసే వరకు ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని… తెలుగుదేశం ఆరోపించింది.
ఇదిలా ఉండగా… ఈ కేసులో ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రభుత్వం వీరిపై పెట్టీ కేసులు పెట్టడంతో వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది. అది కాస్తా మరింత వివాదానికి దారితీసింది. ఇద్దరు పోలీసులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బీజేపీ మాత్రం… పోలీసులకు వంత పాడింది. జేసీ ప్రభాకర్ రెడ్డి బలమైన కేసులు పెట్టి 3 నెలలు జైల్లో పెట్టించగలిగిన జగన్ సర్కారు…. వీరికి గంటల్లో బెయిలొచ్చే కేసులు పెట్టడంపై అందరూ అనుమానాలు వ్యక్తంచేశారు. తాజాగా హైకోర్టులో దీనిపై పిల్ దాఖలు కావడం మరింత ఆసక్తిని రేపుతోంది.