మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీనాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర రాజకీయ సంకటంలో ఉన్నారు. గత ఎన్నికల్లో కోరగానే టికెట్ ఇచ్చి.. తన గెలుపునకు దోహదపడిన పార్టీపైనా.. ప్రభుత్వంపైనా ఆయన కొన్నాళ్లుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లు సహించిన వైసీపీ అధిష్టానం..ఇ టీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో(ఏ మొహం పెట్టుకుని వెళ్లి.. ప్రజలను ఓట్లడగాలి. వారికిఏం చేశామని.. రోడ్లు వేయనందుగా.. ఉద్యోగాలు కల్పించనందుకా) సీఎం జగన్ చాలా సీరియస్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రి..వెంకటగిరి నియోజకవర్గంలో ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్‌కుమార్‌కు అవకాశం ఇచ్చారు. అంటే వచ్చే ఎన్నికల్లో రామ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఆనం ఏం చేయాలి? తనకు అచ్చి వచ్చిన ఆత్మకూరుకు వెళ్లాలా? లేక.. తనను గెలిపించిన వెంకట గిరి నుంచే పోటీ చేయాలా? అనేది ఆయనను తర్జన భర్జనకు గురి చేస్తున్న ప్రధాన అంశం. ఆత్మకూరును తీసుకుంటే.. దాదాపు 9 ఏళ్లకుపైగానే.. ఇక్కడి ప్రజలతో బంధం తెగిపోయింది. కనీసం..ఇక్కడి ప్రజలు ఎలా ఉన్నారనేది కూడా ఆయన ఈ 9 ఏళ్లలో ఏనాడూ పట్టించుకోలేదు.
సో.. ఇప్పటికిప్పుడు వెళ్లి.. నాకు ఓటేయమని అడిగితే.. వేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా.. టీడీపీలో చేరే అవకాశం కూడా పెద్దగా కనిపించడం లేదు. గతంలో పార్టీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు అవే విషయాలను టీడీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరడంపైనా.. ఆనంకు సానుకూల సంకేతాలు రాకపోవడం గమనార్హం. దీంతో ఒంటరిపోరు చేయాలనే ఆలోచన దిశగా ఆనం అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అయితే.. ఇది కూడా ఆత్మకూరా..? వెంకటగిరా? అనేది తేల్చుకోలేక పోతున్నారట.
వెంకటగిరి నుంచి పోటీ చేస్తే..మూడు ముక్కలాటలో(టీడీపీ-వైసీపీ-ఇండిపెండెంట్) తన గెలుపు ఎంత మేరకు సాధ్యమనేది ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరో వైపు ఆత్మకూరు నుంచి బరిలో దిగినా.. ఒంటరి పోరు తప్పదు. ఈ క్రమంలో తనకు కలిసి వచ్చే అవకాశాలు ఏవి? నష్టపోయే పరిస్థితులు ఏవి? అనే విషయాలపై ఆనం గట్టి చర్చలే చేస్తున్నారని ఆయన వర్గం చెబుతోంది. ఎలా చూసుకున్నా ఇప్పటికిప్పుడు ఆనంకు క్లారిటీ రావడం లేదు. మరో ఆరు మాసాలు ఆగిన తర్వాతే.. ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి తర్జన భర్జనకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.