వైసీపీ రెబల్ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల అన్న రీతిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తనను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, అయినా భయపడేది లేదని కోటంరెడ్డి సవాల్ విసురుతున్నారు. అయితే, అసలు కోటంరెడ్డి ఫోన్ టాప్ కాలేదని, అది కాల్ రికార్డింగ్ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోటంరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే కోటంరెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కాలేదని కోటంరెడ్డి స్నేహితుడు శివారెడ్డి చెబుతున్నారని, అయినా సరే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ట్రాప్ లో కోటంరెడ్డి పడ్డారని, ఆయనకు అండగా నిలిచిన పార్టీని కోటంరెడ్డి మోసం చేశారని ఆరోపించారు. వాపు చూసుకొని బలుపు అనుకుంటున్నారని, ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారని అన్నారు.
మరోవైపు, తనపై కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆదాలలాగా తనకు కోట్ల ఆస్తులు లేవని, కానీ ప్రజాబలం ఉందని కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆదాల ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత మూడేళ్లలో ఎమ్మెల్యేగా కోటంరెడ్డి ఎన్నో అరాచకాలు చేశారని ఆదాల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కంటే తనకు 5000 ఓట్లు అధికంగా వచ్చాయని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా వైసీపీ టికెట్ తనకేనని అన్నారు. పోరాటాల నుంచి వచ్చానని చెబుతున్న కోటంరెడ్డి…ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రోజూ ప్రెస్ మీట్ లు పెడుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.