ఒకప్పుడు పదుల సంఖ్యలో కమెడియన్లతో అలరారిన ఇండస్ట్రీ టాలీవుడ్. కానీ 80, 90 దశకాల్లో ఒక వెలుగు వెలిగిన కమెడియన్లు చాలామంది కాలం చేశారు. బ్రహ్మానందం, సునీల్ లాంటి కమెడియన్లకు ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది. ఒకప్పటి స్టయిల్లో వాళ్లు కామెడీ చేసినా జనానికి రుచించట్లేదు. వాళ్లకు సరైన కామెడీ పాత్రలూ పడట్లేదు. వెన్నెల కిషోర్ ఒక్కడే స్టార్ కమెడియన్ జోష్‌లో ఉన్నాడు. రాహుల్ రామకృష్ణ, సత్య, వైవా హర్ష లాంటి కమెడియన్లు అడపాదడపా మెరుస్తున్నారు. వీరి మధ్య తన ఉనికిని చాటుకోవడానికి ఒక యువ కమెడియన్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. అతనే.. రాజ్ కుమార్ కసిరెడ్డి. ఇంకా ఈ పేరు ప్రేక్షకుల్లో పెద్దగా రిజిస్టర్ కాలేదు కానీ.. ‘ఆయ్’ అనే సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ పేరు బాగా పాపులర్ అవుతుందనడంలో సందేహం లేదు.
అశోకవనంలో అర్జున కళ్యాణం, బెదురులంక 2012 లాంటి చిత్రాల్లో మంచి కామెడీ రోల్స్ చేశాడు రాజ్ కుమార్. గోదావరి యాసలో డైలాగులు చెబుతూ డంబ్ క్యారెక్టర్లను బాగా పండిస్తున్న రాజ్ కుమార్‌కు ‘ఆయ్’లో భలే రోల్ పడింది. తాను ఐదేళ్లుగా ప్రేమించిన అమ్మాయిని తన ఫ్రెండు కోసం త్యాగం చేసి నానా అవస్థలు పడే పాత్రలో రాజ్ కుమార్ చెలరేగిపోయాడీ చిత్రంలో. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ కామెడీనే మేజర్ హైలైట్. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ అతను నవ్వించాడు. తన గోదావరి యాస.. కామెడీ టైమింగ్ ఈ పాత్రకు బాగా నప్పాయి. ప్రేక్షకులను నాన్ స్టాప్‌గా నవ్విస్తున్న రాజ్ కుమార్.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతాడనడంలో సందేహం లేదు. ఒకప్పుడు సునీల్ గోదావరి యాసతోనే అదరగొట్టేవాడు. ఇప్పుడు అతడి కామెడీ మెరుపులు పని చేయడం లేదు. ఆ తరహా కామెడీకి రాజ్ కుమార్ బాగానే సూటయ్యేలా ఉన్నాడు.