కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అంచనాలకు మించి పెరుగుతున్న కేసులకు కళ్లాలు వేయటం ఎలా? వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేదెలా? అన్న ప్రశ్నలు కామన్. అయితే.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగానే ఉన్నా.. ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయటం లేదని చెప్పాలి. అదేమంటే.. సామాన్య ప్రజలకు కష్టాలు.. ఆర్థిక ఇబ్బందులు అంటూ బోలెడన్ని మాటలు చెబుతున్నాయే కానీ.. అదే సామాన్య ప్రజలు ఆక్సిజన్ కోసమో.. బెడ్డు కోసమో ఆసుపత్రికి పరుగులు తీస్తే మాత్రం.. వారికి అవసరమైన వైద్య సాయం లభించని పరిస్థితి.
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలన్నా.. దాని వేగానికి ముకుతాడు వేయాలన్నా ఇప్పుడు ఏదైతే నడుస్తోంది ఆ పరిస్థితిలో మార్పు వస్తే తప్పించి సాధ్యం కాదు. ఈ విషయాన్ని ప్రభుత్వపరంగా ఆలోచించకున్నా.. బాలు కర్రీస్ పాయింట్ యాజమాన్యం మాత్రం భేషుగ్గా ఆలోచించింది. కరోనా కేసులు తీవ్రత ఎక్కువగా ఉండటం.. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ ల నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా కొద్దిరోజుల పాటు తమ కర్రీ పాయింట్ కు సెలవు ఇచ్చేశారు.
ఐదారుగురు సిబ్బందితో కావలిలో నడిపే ఈ కర్రీ పాయింట్ స్థానికంగా ఫేమస్. అలా అని ఆర్థికంగా అంత స్థితిమంతుడేం కాదు. కానీ.. వ్యాపారం కోసం కరోనాను తెచ్చుకునే కన్నా.. దాని బారిన తాను.. తన కుటుంబంతో పాటు.. తన సిబ్బంది పడకూడదన్న ముందుచూపుతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నాడు. ఆర్థిక నష్టం గురించి ఆలోచించే ప్రభుత్వాలకు కళ్లు తెరిచేలా.. బాలు కర్రీస్ పాయింట్ నిర్ణయం ఉందంటున్నారు.