ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు…ఈ రెండు విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రేట్లు తగ్గించేది లేదంటూ జగన్ సర్కార్ మొండిపట్టు పట్టింది. ఇలా అయితే, థియేటర్లు మూసేసి కిరాణా కొట్లు పెట్టుకోవాల్సిందేనని హీరో నాని సహా పలువురు థియేటర్ల ఓనర్లు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఏపీ సర్కార్ , టాలీవుడ్ లో కొందరు హీరోలు, దర్శకనిర్మాతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై స్పందించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్న వారిపై దిల్ రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. టికెట్ల రేట్ల తగ్గింపుపై టాలీవుడ్ కు చెందిన వారెవరూ వ్యక్తిగతంగా మాట్లాడవద్దని దిల్ రాజు కోరారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చలు జరపడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ (టీఎఫ్‌సీసీ)కి ఏపీ ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని తెలిపారు. జగన్ అపాయింట్ మెంట్ కోరతామని, త్వరలోనే సీఎంతో ఆ కమిటీ భేటీ అవుతుందని చెప్పారు.
తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ రేట్ల పెంపుపై జీవో వస్తుందని ఆశిస్తున్నట్టు ‘దిల్’ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఛాంబర్ కొంత మంది పేర్లు ఇచ్చిందని, త్వరలో కమిటీ వివరాలను ప్రభుత్వమే వెల్లడిస్తుందని తెలిపారు. కమిటీ ఉంటే చర్చలు జరపడానికి సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే, నేడు మంత్రి పేర్ని నానితో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశానికి, కమిటీకి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం దృష్టికి ఇండస్ట్రీ సమస్యలు సరిగా తీసుకువెళ్లలేదని తాము భావిస్తున్నామని అన్నారు. సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామని, అపాయింట్మెంట్ వస్తే… సీఎంతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తామన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను కూడా కలుస్తామని, టికెట్ రేట్లను పెంచిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని అన్నారు.