గత రెండేళ్లుగా ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ఏపీ డీజీపీ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో సార్లు సుదీర్ఘ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. దళిత యువకుడి శిరోముండనం ఘటన, డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై ఈడ్చెకెళ్లిన ఘటన, ఇక కొద్ది రోజుల క్రితం జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతి గ్యాంగ్ రేప్ ఘటన….ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలానే ఉంది. ఇలా ఏపీలో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నప్పటికీ పోలీసులు నేరాలను అరికట్టడంలో, జరిగిన నేరాలలో దోషులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు నగరంలోని కాకాని రోడ్డులో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్యను ఓ దుండగుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతోన్న రమ్యపై దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజధాని అమరావతికి సమీపంలోని గుంటూరు నగరంలో పట్టపగలే ఇటువంటి దారుణం జరగడంతో నగరంలో శాంతి భద్రతలపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఏపీలో గత రెండేళ్లుగా అమ్మాయిలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలా ఘటనలు పట్టపగలు, నడిరోడ్డుపై జరగడంతో జనం కలవరపడుతున్నారు. ఓ పక్క ఏపీ సర్కార్ దిశ యాప్ పేరుతో హడావిడి చేసిందని, కానీ, ఆచరణలో మాత్రం ఆ హడావిడి లేదని విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా, రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలపై దృష్టి సారించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.