- జగన్, కేసీఆర్ తీరుపై
- రాజకీయ వర్గాల్లో అనుమానం
- అటు ఆంధ్రలో ఆర్థిక సంక్షోభం
- నిరుద్యోగుల్లో ఆగ్రహం
- ఇటు తెలంగాణలో
- హుజూరాబాద్ ఉప ఎన్నిక
- ఈటలను అణగదొక్కేందుకు
- కేసీఆర్ వ్యూహం
- అందుకే కృష్ణా జలాలపై రచ్చ?
- అక్కర్లేకున్నా ప్రాజెక్టుల్లో
- యథేచ్ఛగా జలవిద్యుదుత్పత్తి
- కృష్ణా బోర్డు ఆదేశాలూ బేఖాతర్
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదం వెనుక రాజకీయ లాలూచీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ తమ ప్రభుత్వాలపై నెలకొన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నీటిపై రచ్చ సాగిస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆంధ్రలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. జగన్ సర్కారుపై గనుల దోపిడీ, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు కరోనా నియంత్రణలో వైఫల్యం.. పైగా కొన్ని రోజులుగా నిరుద్యోగులు రోడ్లపై ఉద్యమిస్తున్నారు.
2 లక్షల ఉద్యోగాలకు బదులు కేవలం పది వేల పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై మండిపడుతున్నారు. వీరి ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున సాగుతున్నాయి. మంత్రులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేక అధికార పక్షం నానా ఇబ్బందులు పడుతోంది.
జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటు తెలంగాణలోనూ కేసీఆర్ పరిస్థితి ఏమంత బాగాలేదు. సీనియర్ నేత ఈటల రాజేందర్‌ను ఆయన సాగనంపిన తీరు సొంత పార్టీ టీఆర్ఎస్ శ్రేణుల్లోనే అసంతృప్తిని రాజేసింది.
బీసీ వర్గాల్లో క్రమంగా నిరసన స్వరం పెరుగుతోంది. పైగా ఈటల హుజూరాబాద్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కరోనా నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉప ఎన్నిక జరుపుతుందో లేదో గాని.. ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ ప్రచారం ఆరంభించాయి.
ఈటల ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ శ్రేణులను తన వైపు తీసుకెళ్తున్నారు. వలసలను అరికట్టేందుకు వెళ్తున్న మంత్రులకు నిరసనల సెగ తగుల్తోంది. రెడ్డి సామాజికవర్గం బీజేపీ వైపు వెళ్లకుండా జగన్ సోదరి షర్మిలతో కేసీఆరే కొత్త పార్టీ పెట్టించారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.
ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంతరెడ్డిని అధిష్ఠానం నియమించడంతో కాంగ్రెస్ వర్గాల్లో జోష్ నెలకొంది. ప్రజల దృష్టిలో ఇవి పడకుండా చూసేందుకే కేసీఆర్ కృష్ణా జలాలపై వివాదాన్ని రేపారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల్లో జలవిద్యుదుత్పత్తి చేస్తున్నారు. అమూల్యమైన నీటిని సముద్రంపాల్జేస్తున్నారు.
అదే సమయంలో తెలంగాణ మంత్రులు మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తెగ తిట్టిపోశారు. వీటిపై జగన్ గానీ, ఆయన మంత్రులు గానీ నోరెత్తలేదు. సఖ్యతతో సమస్యను పరిష్కరిస్తామని వారంతా చెబుతున్నారు.
దీనిపై పార్టీ ఆవిర్భావ సభలో షర్మిల కూడా ఆక్షేపించారు. జగన్, కేసీఆర్ కలిసి ఉమ్మడిగా చంద్రబాబును ఓడించారనీ అన్నారు. వీటిపైనా అటు నుంచి స్పందన లేకపోవడం కుమ్మక్కు ఆరోపణలకు బలమిస్తోంది.
రైతు సంఘాల ఆగ్రహం
ఇంకోవైపు.. ట్రైబ్యునళ్లూ, బోర్డులూ అక్కర్లేదని.. పరస్పర అవగాహనతో కృష్ణా జలాలను పంచుకుందామని నిన్నమొన్నటిదాకా చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆకస్మికంగా మాట మార్చేయడంపై ఆంధ్ర రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
కృష్ణా జలాల్లో సగం వాటా తమ రాష్ట్రానికి రావలసిందేనని, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను తాము గుర్తించడం లేదని ఆయన కుండబద్దలు కొట్టినా జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వం స్పందించకపోవడం వాటికి విస్మయం కలిగిస్తోంది.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను ట్రైబ్యునల్ కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత పరస్పర అంగీకారంతో.. 66:34 నిష్పత్తిలో ఏపీకి 512.. తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు.
ఏడేళ్లుగా కృష్ణా బోర్డు ఇదే దామాషాలో నీటి పంపిణీ చేస్తోంది. దీనికి రెండు రాష్ట్రాలూ సమ్మతిస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు తమకు సగం వాటా రావలసిందేనని కేసీఆర్ అంటున్నారు. పైగా విభజన చట్టానికి లోబడి ఏర్పడిన గోదావరి, కృష్ణా బోర్డులను అంగీకరించేది లేదని చెబుతున్నారు.
గోదావరి, కృష్ణా జలాల వినియోగం విషయంలో కేసీఆర్ పెద్దమనసుతో స్పందించారంటూ చెబుతూ వచ్చిన జగన్ ఇప్పుడు ఏమంటారని నిపుణులు, విపక్షాల నేతలు నిలదీస్తున్నారు.
స్వప్రయోజనాల కోసం రైతాంగ ప్రయోజనాల కోసం తాకట్టుపెడతారా అని మండిపడుతున్నారు. ఇంత జరిగినా సీఎం ఇటీవల అనంతపురం పర్యటనలో పొరుగు రాష్ట్రంతో సఖ్యత కొనసాగిస్తామనడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పైగా తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే తాను మౌనంగా ఉన్నానని అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో, తెలంగాణలో నివసించేవారి ఆస్తులకు గానీ.. ప్రాణాలకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు.
కేసీఆర్‌తో లాలూచీ కారణంగానే ఈ అంశాన్ని జగన్ ప్రస్తావించారన్న ఆరోపణలున్నాయి. అన్ని ప్రాజెక్టుల్లో నూరు శాతం సామర్థ్యంతో జలవిద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34పై ఆంధ్రప్రదేశ్ పోరాడాల్సి ఉంది.
న్యాయస్థానంలో సవాల్ చేయాలి. కానీ జగన్ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.