సీఎం జగన్ , ఆయన సోదరి వైఎస్ షర్మిలల మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలోనే షర్మిల సొంత కుంపటి పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలో కీలక పదవి ఆశించిన షర్మిలకు అన్న చేతిలో భంగపాటు తప్పకపోవడంతో ఆమె తెలంగాణలో వైఎస్సార్ టీపీ పార్టీ పెట్టారని రాజకీయ వర్గాల్లో జోరుగా పుకార్లు వినిపించాయి. 2014 ఎన్నికలకు ముందు జగన్ జైల్లో ఉన్నపుడు షర్మిల ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకొని పార్టీని ముందుకు నడిపించారు.
దీంతో పాటు, 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన షర్మిల …వైసీపీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇదే విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తావించి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ సోదరి షర్మిల పాత్ర కూడా కీలకమని రఘురామ అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, ఎన్నికలకు ముందు షర్మిల పార్టీ తరఫున బాగా ప్రచారం చేశారని రఘురామ కితాబిచ్చారు. అందుకే, జగన్ తన ఆస్తుల్లో సగభాగం షర్మిలకు ఇవ్వాలని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విజయంలో సగభాగం షర్మిలదేనని, అందుకే షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వాలని రఘురామ సూచించారు. రఘురామ తాజా వ్యాఖ్యలు జగన్ ను ఇరకాటంలో పడేసేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు, ఇప్పటికే జగన్, షర్మిలల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో అన్నాచెల్లెళ్లిద్దరూ వేర్వేరుగా తమ తండ్రి సమాధి దగ్గరకు వచ్చి నివాళులర్పించడం చర్చనీయాంశమైంది. దీంతో, షర్మిల, జగన్ ల మధ్య విజయమ్మ నలిగిపోతున్నారని, ఎటూ చెప్పలేక సతమతమవుతున్నారని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సగం ఆస్తి షర్మిలకు ఇవ్వాలంటూ ఆర్ఆర్ఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.