30 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని రచించుకుని.. ముందుకు దూసుకుపోయే లక్ష్యంతో అడుగులు వేస్తున్న వైసీపీకి అంతర్గత కుమ్ములా టలు.. పెను వివాదంగా మారుతున్నాయి. కలివిడితో సాధించాల్సిన ప్రజామోదాన్ని.. విడివిడిగా సాధించేందుకు నేతలు ప్రయత్ని స్తున్న వైనం.. పార్టీకి ఎసరు పెట్టే ప్రమాదం ఉందనే సంకేతాలు ఇస్తోంది.
ఎక్కడికక్కడ.. ఎవరికి వారు ఆధిపత్య రాజకీయాలకు తెరదీస్తున్న ఫలితంగా వైసీపీ గ్రాఫ్ నానాటికి జారుడు మెట్లపై విన్యాసం చేస్తున్న పరిస్థితిని కళ్లకు కడుతోంది. నాకు నేనే అని ఎంపీలు.. మాకు మేమే అని ఎమ్మెల్యేలు.. ఎవరికి వారు.. రాజకీయాలు చేస్తున్న వైనం.. పార్టీకి అశనిపాతంగా పరిణమిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
గత 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీతో కొట్టుకొచ్చిన నాయకులు.. తమకు అఖండ ప్రజాబలం ఉందని.. దీనిని మార్పు చేయడం ఎవరివల్లాకాదని నిర్ణయించుకున్న పరిస్థితి నియోజకవర్గాల్లో ప్రజలకు వారిని దూరం చేస్తోంది.
ప్రజాబలం అనేది నాయకులకు అత్యంత కీలకమైన విషయం. కానీ, గత ఎన్నికల్లో జగన్ పాదయాత్రను అడ్డుపెట్టుకుని విజయం దక్కించుకున్నామనే స్పృహ కోల్పోయిన నాయకగణం.. వేస్తున్న చిందులు నిక్కచ్చిగా వారి పరాజయాన్ని వారే కొనితెచ్చుకుంటున్న పరిస్థితిని సృష్టిస్తు న్నాయి.
ఎంపీ అయితే.. ఏంటి? అనే భావన ఎమ్మెల్యేల్లోను, ఎమ్మెల్యేలు మా కింద పనిచేయాలనే భావన ఎంపీల్లోనూ గూడుకట్టుకుని.. ఆధిపత్య రాజకీయాల దిశగా నాయకులు అడుగులు వేసే పరిస్థితిని తీసుకువచ్చింది.
రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు..వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. తారస్థాయిని తలపిస్తున్నాయి. చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు స్థానిక ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ఆధిపత్యానికి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసే పరిస్థితి వచ్చింది.
అనంతపురం ఎంపీ రంగయ్యకు.. స్థానికంగా నలుగురు ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గు మనే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం ఎంపీ.. ఏదో ఉన్నానంటే ఉన్నానని అంటున్నారు తప్ప.. నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక ఆయనకు కనిపించడం లేదు.
గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ దూకుడుకు ఎమ్మెల్యే కళ్లెం వేస్తున్న పరిస్థితి కనిపిస్తుండడం పార్టీలో తీవ్ర రగడకు దారితీసింది.
కడప ఎంపీ వైఖరి నచ్చని కొందరు ఎమ్మెల్యేలు.. ఇంటికే పరిమితమయ్యారనే వాదనను ఎవరూ తోసిపుచ్చడం లేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రాజమండ్రి ఎంపీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయనకు స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు రగులుతూనే ఉన్నాయి. కర్నూలు ఎంపీతోనూ ఎమ్మెల్యేలు అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు.
ఇక, ఇటీవల వెలుగు చూసిన… ఒంగోలు ఎంపీ వర్సెస్ నెల్లూరు ఎమ్మెల్యే వ్యవహారం మరో కీలక వివాదంగా మారింది. ఇలా.. 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో 20 నియోజవర్గాల పరిస్థితి వైసీకి తీవ్ర తలనొప్పిగా మారినా.. ఎవరూ పట్టించుకుని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు.
ఇదే పరిస్థితి కొనసాగితే.. పార్టీకి ఇబ్బందులు తప్పవని.. అంటున్నారుపరిశీలకులు.