ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీయాలనుకోవడం మామూలే. తెలుగులోనే కాక వివిధ భాషల్లో ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. కాకపోతే తెలుగులో సీక్వెల్స్ పెద్దగా కలిసొచ్చిన దాఖలాలు లేవు. కొనసాగింపు చిత్రాలు చాలా వరకు అంచనాలు అందుకోలేకక ప్రేక్షకులను నిరాశకు గురి చేసినవే.
ఐతే ఈ మధ్య టాలీవుడ్ కొత్త దారిలో పయనిస్తోంది. ఒక సినిమాగా తీద్దామనుకున్న ప్రాజెక్టును రెండు భాగాలు చేయడం ద్వారా బడ్జెట్ నుంచి ఆదాయం వరకు అన్నీ పెంచుకునే మార్గం చూస్తోంది. ‘బాహుబలి’ ఇందుకు స్ఫూర్తి కాగా.. ఆ బాటలో తెలుగు చిత్రాలే కాక వేరే భాషా సినిమాలు కూడా పయనిస్తుండటం విశేషం.
తాజాగా ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించడంతో మున్ముందు ఇదో ట్రెండ్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.
కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమని తేలింది. అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. నిజానికి ఈ చిత్రం మొదలైంది ఒక సినిమాగానే.
స్క్రిప్టు దశలో కూడా రెండు భాగాల ఆలోచనే లేదు. కాకపోతే కథ మాత్రం అనుకున్నదానికంటే పెద్దదైంది. ఐతే షూటింగ్‌కు ముందు స్క్రిప్టు లాక్ చేయడం అలవాటు లేని సుకుమార్.. షూటింగ్ దశలో ఏం తీయాలనుకుంటే అది తీయడం.. ఆన్ ద స్పాట్ కొత్త సీన్లు జోడిరచడం, ముందు అనుకున్నవి తీసేయడం లాంటివి మామూలే. తర్వాత ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఫైనల్ కాపీపై ఒక అంచనాకు వస్తుంటాడాయన.
ఐతే కరోనా కారణంగా ఈ సినిమా పట్టాలెక్కడంలో, షూటింగ్ కొనసాగడంలో ఆలస్యం జరిగింది. సెకండ్ వేవ్ సమయానికి చూస్తే.. తాను అనుకున్న కథను ఒక సినిమాగా తీసి న్యాయం చేయలేనని భావించి సుక్కు.. రెండు భాగాల ఆలోచనకు వెళ్లాడు.
సినిమా బడ్జెట్ పెరిగిపోవడం, ఆలస్యమవుతుండటం కూడా ఇందుకు దోహదం చేసి ఉండొచ్చు. మొత్తానికి ‘పుష్ప’ రెండు భాగాలుగా రాబోతున్న విషయం ఖరారైంది. ఐతే ‘పుష్ప’కు ముందు, తర్వాత కూడా ఇలాంటి ప్రయత్నాలు లేకపోలేదు.
ఆర్జీవీ మొదలుపెడితే..
ఒక కథను రెండు భాగాలుగా చేసి అద్భుత ఫలితాన్ని అందుకున్న సినిమాగా అందరికీ ‘బాహుబలి’నే గుర్తుకొస్తుంది. ఆ చిత్రాన్ని కూడా ముందు ‘ఒకటి’గానే మొదలుపెట్టారు. కానీ మేకింగ్ మధ్యలోకి వచ్చేసరికి రాజమౌళి ఆలోచన మారిపోయింది. రెండు భాగాల ప్రతిపాదన చేశాడు.
ఇదే విషయాన్ని వెల్లడిస్తే ప్రేక్షకులకు అయోమయంగా అనిపించింది. ఒక దశలో ఈ ఆలోచన బూమరాంగ్ అవుతుందేమో అన్న భయాలు కూడా కలిగాయి. అయినా జక్కన్న ధైర్యం చేశాడు.
ఐతే ‘బాహుబలి: ది బిగినింగ్’లో కథను మధ్యలో ఆపేయడంపై ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైనా.. అక్కడ ఇచ్చిన ట్విస్టు రెండో భాగంపై ఆసక్తిని అమాంతం పెంచేసింది. అది సినిమాకు ఎంతగానో లాభం చేకూర్చింది.
‘బాహుబలి: ది కంక్లూజన్’ అసాధారణ ఫలితాన్నందుకోవడానికి కారణమైంది. మొత్తంగా ఈ రెండు సినిమాల ఫార్ములా అద్భుతంగా పని చేసింది ‘బాహుబలి’ విషయంలో. ఐతే రాజమౌళి కంటే ముందు రామ్ గోపాల్ వర్మ ఈ ఫార్ములాను అనుసరించిన విషయం మరువరాదు.
ఆయన ‘రక్తచరిత్ర’ను రెండు భాగాలుగా తీసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ చిత్రం రెండు భాగాలుగా వస్తుందని వర్మ ముందుగా ప్రకటించలేదు. అది ఒక సినిమా అనుకునే థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు చివర్లో పెద్ద షాక్ తగిలింది. పరిటాల రవి కథను సగమే చెప్పి.. మిగతా సగం రెండో భాగంలో చూసుకోమన్నాడు.
రక్తచరిత్ర-1 పెద్ద హిట్టవడంతో రక్తచరిత్ర-2 మీద అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. కానీ ఆ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కానీ రాజమౌళి మాత్రం ‘బాహుబలి’తో మ్యాజిక్ చేశాడు. ఈ ప్రయత్నం ‘కేజీఎఫ్’కు స్ఫూర్తిగా నిలిచింది. ఆ చిత్రాన్ని మొదలుపెడుతున్నపుడే రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించారు.
కన్నడలో మామూలుగా మొదలైన ఈ సినిమా.. విడుదల సమయానికి వివిధ భాషల్లోకి వచ్చింది. అన్ని చోట్లా అద్భుత విజయాన్నందుకుని ‘కేజీఎఫ్-చాప్టర్ 2’ మీద అంచనాలను భారీగా పెంచేసింది. ‘బాహుబలి’ తర్వాత అంతగా సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూడటం ఈ సినిమా విషయంలోనే జరుగుతోంది.
కరోనా వల్ల ఆలస్యమైన ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కచ్చితంగా ‘బాహుబలి-2’ లాగే ‘కేజీఎఫ్-2’ కూడా సంచలన విజయం సాధిస్తుందన్న అంచనాలున్నాయి. ఆ తర్వాత ‘పుష్ప’ రెండు భాగాల సంగతేమవుతుందో చూడాలి.
ఆ సినిమా కూడా మంచి ఫలితాన్నందుకుంటే ‘2 పార్ట్’ సినిమాలు మరిన్ని తెరకెక్కడం ఖాయం. ఇప్పటికే నితిన్ హీరోగా లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య ‘పవర్ పేట’ అనే సినిమాను రెండు భాగాలుగా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కాకపోతే ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
మంచెంత.. చెడెంత?
ఒక సినిమాను రెండు భాగాలు తీయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా బడ్జెట్ సమస్యలు తీరిపోతాయి. రాజీ లేకుండా ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు. కథలో ఆకర్షణీయ ఘట్టాలు ఎక్కువగా ఉంటే.. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఏం తీసేయాలి, ఏం ఉంచాలనే తలనొప్పి తగ్గుతుంది.
ఇక అన్నింటికీ మించి ఆదాయం, లాభం పెరుగుతుంది. రెట్టింపు బిజినెస్ చేసుకోవచ్చు. రెండు వేర్వేరు చిత్రాలతో పోలిస్తే ఒక కథను రెండు భాగాలుగా తీసినపుడు మేకింగ్ కూడా తేలిక అవుతుంది. ఇక ఫస్ట్ పార్ట్ మంచి ఫలితాన్నందుకుంటే.. సెకండ్ పార్ట్‌కు హైప్ తేవడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సిన పని లేదు.
ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేస్తుంది. ఐతే ఈ రెండు భాగాల సినిమాల విషయంలో కొన్ని ప్రతికూలతలు కూడా లేకపోలేదు. కథ డిమాండ్ చేయకుండా ఆర్థిక ప్రయోజనం కోసమో, మరో కారణంతోనో రెండు భాగాల ఆలోచన చేస్తే మొదటికే మోసం రావచ్చు.
తొలి భాగం తర్వాత సెకండ్ పార్ట్ మీద నెలకొన్న అంచనాలను అందుకోవడం అంత తేలిక కాదు. ‘రక్తచరిత్ర-2’ ఈ విషయంలోనే విఫలమై ఫ్లాప్ అయింది. రాజమౌళి లాంటి మాస్టర్ డైరెక్టర్ కాబట్టి ‘బాహుబలి-2’పై నెలకొన్న అంచనాలను అందుకోగలిగాడు కానీ.. లేకుంటే ఈ సినిమా కూడా తేడా కొట్టేదే.
ఇప్పుడిక ‘కేజీఎఫ్-2’తో ప్రశాంత్ నీల్ ఏమేర అంచనాలు అందుకుంటాడో చూడాలి. కథలో విషయం లేకున్నా.. వేరే కారణాలతో సాగదీస్తే అది చెడిపోవచ్చు. ‘పుష్ప’ విషయంలో ఇలాంటి సందేహాలే ఉన్నాయి జనాల్లో. మరి దాని ఫలితం ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి మున్ముందు 2 పార్ట్ ట్రెండ్ ఊపందుకునే అవకాశముంది.