‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మొదటగా అనుకున్న విడుదల తేదీ 2020 జులై 30. కానీ ఎప్పట్లాగే రాజమౌళి మేకింగ్ ఆలస్యం చేశాడు. దీంతో ఈ సినిమాను 2021 జనవరి 8న విడుదల చేయడానికి కొత్త ముహూర్తం నిర్ణయించారు. ఈ ప్రకటన చేసిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి వచ్చి పడిరది. నాలుగైదు నెలలు షూటింగ్ ఆగిపోవడంతో రెండో డేట్‌ను కూడా అందుకోలేని పరిస్థితి తలెత్తింది. ఇక కరోనా ఫస్ట్ వేవ్ ముగిసి షూటింగ్ పున:ప్రారంభం అయ్యాక బాగా ఆలోచించి జక్కన్న అండ్ టీం 2021 అక్టోబరు 13 అంటూ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు కొత్త డేట్ ఇచ్చింది.
ఐతే ఆ డెడ్‌లైన్‌ను అందుకునే దిశగా అడుగులు పడుతుండగానే.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మొదలైంది. మళ్లీ షూటింగ్ ఆగింది. రెండు నెలలకు పైగా గ్యాప్ రావడంతో మళ్లీ షెడ్యూళ్లు దెబ్బ తిన్నాయి. దీంతో దసరా కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ రావడం అసాధ్యం అని ప్రేక్షకులంతా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేశారు.
ఇప్పటికే రెండుసార్లు సినిమా వాయిదా పడ్డప్పటికీ.. పరిస్థితుల దృష్ట్యా మరోసారి పోస్ట్ పోన్ చేసినా ప్రేక్షకులు అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారు.
కానీ ఆశ్చర్యకరంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం అక్టోబరు 13 రిలీజ్ విషయంలో చాలా పట్టుదలతో కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ టైంలో టైం వేస్ట్ కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగించడం ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ను ట్రాక్‌లో పెట్టినట్లున్నాడు జక్కన్న. ఐతే రాజమౌళి టీం ఎంతో కష్టపడి మాటకు కట్టుబడి ఉండాలని చూస్తుండటం మంచిదే కానీ.. పరిస్థితులు ఏమేర సహకరిస్తాయన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత నెలలోనే దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అయితే ఎత్తేశారు కానీ.. తెలుగు రాష్ట్రాలు సహా ఎక్కడా కూడా థియేటర్లు అంతగా తెరుచుకోలేదు.
ముందు అవి తెరుచుకోవాలి. జనాలు థియేటర్లకు రావాలి. థియేటర్లలో ఒకప్పటి కళ కనిపించాలి. దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలున్న నేపథ్యంలో అన్ని చోట్లా థియేటర్ల మునుపటి లాగా మామూలుగా నడిస్తే తప్ప ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేరు. మరి కరోనా థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో దసరా టైంకి థియేటర్లు సాధారణ స్థితిలో నడుస్తాయా అన్నది డౌటే. ఐతే తమ వరకు లోపం లేకుండా ఆ సమయానికి సినిమా పూర్తి చేసేయాలని రాజమౌళి బృందం పట్టుదలతో ఉన్నట్లుంది. కానీ ఇంకో మూడు నెలల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేరు. మూడో వేవ్ అనివార్యం అంటున్న నేపథ్యంలో వైరస్ ప్రభావం కాస్త ఉన్నా దసరాకు ‘ఆర్ఆర్ఆర్’ రావడం సందేహమే.