గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు కొట్టారన్న కారణంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనలోనే పోలీసులు కొట్టిన మరో యువకుడు శ్రీకాంత్ గుండెపోటుతో మరణించడం పెనువిషాదాన్ని రేపింది. ఈ రెండు ఘటనలతో పల్నాడు ప్రాంతంలోని గురజాల నియోజకవర్గంలో కీలకమైన దాచేపల్లి మండలం అట్టుడికిపోతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ పై గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు.
అలీషాది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. అక్రమమద్యాన్ని అధికార పార్టీనే సరఫరా చేస్తూ అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. అలీషా మరణానికి కారణమైన వారిని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, అలీషా కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలీషా కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలీషా మృతదేహాన్ని సందర్శించి…అతడి కుటుంబ సభ్యులను యరపతినేని ఓదార్చారు.
మరోవైపు, అలీషా కేసులో సీఐ కొండారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అలీషా మృతదేహంతో దాచేపల్లిలోని అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై అలీషా కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి అయిన అద్దంకి-నార్కట్పల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో, మాచర్ల నుంచి గుంటూరు వెళ్లాల్సిన బస్సులకు కారంపూడి మీదుగా గుంటూరుకు తరలిస్తున్నారు. అలీషా మరణంతో పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
అసలేం జరిగిందంటే….
దాచేపల్లికి చెందిన షేక్ అలీషా, శ్రీకాంత్ లు భట్రుపాలెం నుంచి కారులో మద్యం తెస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. భట్రుపాలెం వద్ద అడ్డుకొని మద్యం ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. మద్యం తమ వద్ద లేదని చెప్పినా వినకుండా వారిపై ఎక్సైజ్ సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కొట్టారన్న మనస్తాపంతో అలీషా పురుగులమందు తాగి చికిత్స పొందుతూ మరణించాడు. తమపై దాడి చేశారన్న ఆరోపణలతో ఈ కేసులోనే మరో ముగ్గురు యువకులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి.