ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా కంపెనీ చుట్టు ఇఫుడు చర్చలు పెరిగిపోతున్నాయి. కంపెనీ వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని ప్రభుత్వం గగ్గోలు పెడుతోంది. వాతావరణ కాలుష్యంతో పాటు భూగర్భజలాలు కూడా కలుషితమైపోతున్న కారణంగా తామే కంపెనీని వెంటనే ఏపీ నుంచి వెళ్లిపొమ్మన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారి విజయకుమార్ చెప్పడం సంచలనంగా మారింది.
ఒకవైపు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలను రమ్మని ఆహ్వానిస్తూనే మరోవైపు ఉన్న కంపెనీలను వెళ్ళిపోయేట్లు చేయడం దేనికి సంకేతమో జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే విభజన జరిగిన దగ్గర నుండి రాష్ట్రంలో రాజకీయ కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీని కారణంగానే వాతావరణ కాలుష్యం కన్నా రాజకీయ కాలుష్యమే పరిశ్రమల మూసి వేతకు, తరలింపునకు కారణమవుతోందనే విమర్శలు పెరిగిపోతున్నాయి.
ఇపుడు హాట్ టాపిక్ గా మారిన అమరరాజా కంపెనీ విషయమే తీసుకుందాం. నిజంగానే కంపెనీ వల్ల భూ, వాతావరణ కాలుష్యం పెరిగిపోయి వేలాదిమంది ఇబ్బందులు పడుతున్నారనే అనుకుందాం. దానికి పరిష్కారం కంపెనీని రాష్ట్రంనుండి తరిమేయటం కాదుకదా. అసలు ఏ కంపెనీ వల్ల వాతావరణం కలుషితం కావడం లేదో జగన్ చెప్పగలరా ? మిగిలిన కంపెనీలను పక్కన పెట్టేసినా సొంతదైన భారతీ సిమెంట్స్ వల్ల వాతావరణం కలుషితం కావడంలేదా ? భారతీ సిమెంట్స్ నుండి కాలుష్యం వస్తోందా ? లేకపోతే బంగారం వస్తోందా? అన్న సందేహాలు సామాన్య మావవుడికి రాక మానవు.
ఉత్పత్తితో ముడిపడి ఉన్న ఏ కంపెనీ నుంచైనా కాలుష్యమే బయటకొస్తుంది. దాన్ని నియంత్రించడానికి లేదా వీలైనంత తగ్గించటానికి కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంటోందనేది కీలకం. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యానికి చెప్పాలి. రేపు అమరరాజా కంపెనీ ప్లేసులో మరో ఉత్పత్తి కంపెనీ వచ్చినా ఇదే సమస్య తలెత్తుతుంది. అలాగే కంపెనీ కూడా ఏపీ నుండి తమిళనాడుకు వెళ్ళినా అక్కడా కొద్దికాలం తర్వాత ఇదే సమస్య తలెత్తుతుంది. అపుడు యాజమాన్యం ఏమి చేస్తుంది ? అక్కడి ప్రభుత్వం ఏంచేస్తుంది ?
ఇక్కడ గమనించాల్సిందేమంటే వాతావరణ కాలుష్యం కన్నా రాజకీయ కాలుష్యం పెరిగిపోతోంది. టీడీపీని ఇబ్బందులు పెట్టడానికి వైసీపీ ప్రయత్నాలు చేసుకోవడం వల్లే పరిస్ధితి దారుణమైపోతోంది. జగన్ నిర్ణయాల వల్లే కేంద్రప్రభుత్వం ముందు రాష్ట్రం పలుచనైపోయింది. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని జగన్ ముందుకు సాగాల్సిన అవసరముంది. అలా కాదని, కక్షా రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తానంటే ఏపీలో కంపెనీలు ఒక్కొక్కటిగా ఏ తమిళనాడుకో…కర్ణాటకకో తరలిపోవాల్సిందే.