అయ్యయ్యో చేతులో డబ్బులు పోయెనో….అయ్యయ్యో….ఖజానా ఖాళీ ఆయెనే….ఉన్నది కాస్తా ఊడింది…సర్వమంగళం పాడింది…కార్పొరేషన్ల పేరుతో బ్యాంకులిచ్చే అప్పుల సహా తిరుక్షవరమై పోయింది…వినడానికి కామెడీగా ఉన్న ఈ పేరడీ పాట ప్రస్తుతం ఏపీ సర్కార్ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఏపీకి పెట్టుబడులు రాకపోవడం, ఉన్న కంపెనీలపై కక్ష సాధింపు చర్యల వంటి పలుకారణాలతో ఏపీ ఖజానా ఖాళీ అవుతోంది.
నెల నెలా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు చెల్లించేందుకు దిక్కులు చూడాల్సిన పరిస్థితిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జగన్ చేస్తున్న అప్పులు…తప్పులు…నానాటికీ పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా వైసీపీ నేతలు పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా, జనం కోసం అప్పులు చేస్తే తప్పేంటని..ఆర్థిక మంత్రి బుగ్గన తమ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, తప్పులను సమర్థించడం విడ్డూరం. ఇక, ఈ పంచాయతీ అంతా ఎందుకని ఖజానా నింపేందుకు జగన్ సర్కార్ ఓ సరికొత్త విధానానికి కూడా తెర తీసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి కొన్ని వేల కోట్లు అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం….కొంతవరకు ఖజానా నింపుకుంది. ఇపుడు మళ్లీ ఖజానా నిండుకోవడంతో తాజాగా మరో రూ.50,000 కోట్లు అప్పు తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ తరహాలోనే మరో రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి…వాటి ద్వారా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుందామని స్కెచ్ వేసింది. అయితే, మీ ప్రభుత్వానికి అప్పులివ్వలేము మహాప్రభో అంటూ బ్యాంకర్లు అడ్డం తిరగడంతో జగన్ షాక్ తగిలింది.
అప్పుల సంద్రంలో మునిగితేలుతూ…ఏదో ఒకనాడు టైటానిక్ లాగా మునగడానికి రెడీగా ఉన్న ఏపీ సర్కార్ ను నమ్మడానికి సిద్ధంగా లేమని పరోక్షంగా బ్యాంకర్లు చెప్పినట్లయింది. ఏపీ సర్కార్ అప్పులపై మీడియాలో కథనాలు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటుచేసిన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌పై కేంద్రం అభ్యంతరాలు చూసి బ్యాంకర్లకు జగన్ సర్కార్ పై నమ్మకం పోయినట్టు కనిపిస్తోంది. ఆర్థిక లావావేవీలు, అవకతవకలలో ఆరితేరిన జగన్ ఎంత చెప్పినా బ్యాంకర్లు అప్పించేందుకు విముఖత వ్యక్తం చేశారట.
ఇక, డ్యామిట్ కథ అడ్డం తిరిగిందనుకున్న జగన్….ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ను అప్పుల కోసం తిప్పలు పడమంటూ మళ్లీ ఢిల్లీకి పంపారని తెలుస్తోంది. ఏపీ ఖజానాకు ఆక్సిజగన్ లా పనిచేస్తున్న అప్పులు ఆగిపోయిన మరునిమిషం రాష్ట్రం దివాలా తీస్తుందన్న సంగతి తెలిసిన జగన్, బుగ్గన…ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే, రాజ్యాంగవిరుద్ధంగా ఎస్డీసీ నుంచి తెచ్చిన అప్పులకు సమాధానం చెప్పాలంటూ కేంద్రం నిలదీసింది.
దీంతో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో జగన్ అండ్ కో ఉందట. మరోవైపు, ఒకే అప్పుపై రెండు సార్లు వడ్డీ చెల్లించే దుస్థితికి ఏపీ ఆర్థిక శాఖ వచ్చిందంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత దుర్భర స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి 7 శాతానికి పైగా వడ్డీకి అప్పులు తెచ్చినడబ్బులను ఆర్బీఐ ఓడీ కింద జమ చేసేసుకుంటోంది. ఆ ఓడీపై దాదాపు 5 శాతం వడ్డీని ఆర్బీఐ మరలా వసూలు చేస్తోంది. ఏపీకి ఈ అప్పుల తిప్పలు తీరేదెన్నడో ఆ ‘జగన్’ నాటక సూత్రధారికే తెలియాలి.