తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై తీన్మార్ మల్లన్న కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. రాజకీయంగానూ కేసీఆర్ ను ఎదుర్కోవాలని డిసైడ్ అయిన మల్లన్న…కొద్ది నెలల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గట్టి పోటీనిచ్చారు. ఇక, తన ఫొటోలను మీడియా ముందు తప్పుగా ప్రదర్శిస్తన్నారంటూ మల్లన్న పై ప్రియాంకా అనే యువతి ఫిర్యాదు చేయడంతో మల్లన్న ఆఫీసుపై సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
కొంతకమంది రాజకీయ నేతలు, ప్రముఖులకు సంబంధించిన సమాచారాన్ని మల్లన్న రహస్యంగా సేకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ రైడ్ జరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ఆఫీసులో జరిగిన సోదాలపై తీన్మార్ మల్లన్న స్పందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సోదాలు చేయాల్సింది తన ఆఫీసులో కాదని, కేసీఆర్ ఫాం హౌస్ లో అని మల్లన్న షాకింగ్ కామెంట్లు చేశారు.
వరంగల్ అభివృద్ధిని కేసీఆర్ గాలికొదిలేశారని, కేసీఆర్ కు వరంగల్‌లోనే రాజకీయ సమాధి కడతానని మల్లన్న వార్నింగ్ ఇచ్చారు. 400మంది పోలీసులతో తన ఆఫీసులో కేసీఆర్ తనిఖీలు చేయించారని, యువతితో ఫిర్యాదు విషయంలో కేసీఆర్ త్వరలోనే పూల్ కాబోతున్నాడని ఎద్దేవా చేశారు. వరంగల్‌ను తెలంగాణ రాజధానిగా ప్రకటించాలని, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. అంతకుముందు, ఆ యువతి ఫిర్యాదు ప్రకారం మల్లన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తునకు సహకరించాలని, బాధితులు, సాక్షులను ప్రభావితం చేయొద్దని మల్లన్నకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.