ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్ బెయిల్ రద్దు వ్యవహారంతో రఘురామకు శత్రువులు పెరిగారు. ఈ క్రమంలోనే రఘురామకు బెదిరింపు ఫోన్ కాల్స్, సోషల్ మీడియాలో బెదిరింపు పోస్టులు వస్తూనే ఉన్నాయి. అయితే, తాజాగా పార్లమెంటు సాక్షిగా రఘురామను చంపేస్తానంటూ బెదిరింపు వచ్చింది.
ఈ బెదిరింపును ఎవరో సాధారణ వ్యక్తి చేశారనుకుంటే పొరపాటే. సాక్షాత్తూ వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్….రఘురామను చంపేస్తానంటూ పార్లమెంటు సాక్షిగా వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది. దీంతో, మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తనను మాధవ్ దుర్భాషలాడారని, జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రెస్మీట్లు పెట్టడం ఆపకుంటే అంతం చేస్తామని బెదిరించారని ఆరోపించారు.
ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా అక్కడే ఉన్నారని, ఇతర ఎంపీలు ఉండటంతో మాధవ్ వ్యాఖ్యలకు తాను స్పందించలేదని చెప్పారు. సెంట్రల్ హాల్ లో సీసీటీవీ ఫుటేజ్ చూసినా గోరంట్ల మాధవ్ తనతో మాట్లాడినపు హావభావాలు బెదిరించేలా ఉన్నాయన్నది స్పష్టమవుతుందని, కెమెరాల్లో మాధవ్ మాట్లాడింది వినిపించకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్ అర్దమవుతుందని చెప్పారు.
మాధవ్ తో జగనే మాట్లాడించారా, లేక జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి మాధవ్ ఇలా మాట్లాడారా అన్నది తనకు తెలీదని అన్నారు. ఈ విషయంలో తాను వెనుకడుగు వేయబోనని, స్పీకర్ సైతం తన ఫిర్యాదు పైన సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు గోరంట్ల మాధవ్ స్పందించలేదు.