ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి ఈ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. వివేకా వాచ్ మన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ఈ మర్డర్ మిస్టరీలో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్ పై సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గోవాలో ఉన్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
కొద్ది రోజుల క్రితం ఈ కేసు విచారణలో సునీల్ యాదవ్ పాల్గొన్నాడు. అయితే, విచారణకు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. కానీ, అందుకు భిన్నంగా సునీల్ యాదవ్ తన కుటుంబంతో కలిసి ఇటీవల కనపడకుండా పోయారు. దీంతో సునీల్ యాదవ్ కోసం ముమ్మరంగా గాలించిన అధికారులు ఎట్టకేలకు అతడిని గోవాలో పట్టుకున్నారు. సునీల్ ను గోవాలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు…తదనంతర లీగల్ ప్రక్రియపై ఫోకస్ పెట్టారు.
సునీల్ ను కోర్టులో ప్రవేశపెట్టే ప్రక్రియపై అధికారులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. వివేకా హత్య కేసులో విచారణ జరుపుతోన్న సీబీఐ అధికారులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ అని సీబీఐ అధికారులు భావిస్తున్నట్టు ఆ కథనాల్లో వెల్లడించారు. తాజాగా సునీల్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ కేసులో మరింతమంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.