అమ్మాయి అయినా అబ్బాయి అయినా తప్పు తప్పే. ఏ మాత్రం తప్పు చేయకుండా.. కండకావరం అన్నట్లుగా నడిరోడ్డు మీద తనకు తోచినట్లుగా చెలరేగిపోయిన ఒక అమ్మాయి ఉదంతం ఇది. తాజాగా సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న ఈ వీడియో.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక కాలమిస్టు కమ్ కాంగ్రెస్ మహిళా నేత ఒకరు సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు. గడిచిన రోజుగా ట్విట్టర్ లో ఈ లక్నో అమ్మాయిని అరెస్టు చేయాలంటూ ఒక పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన రెండు నిమిషాలకు పైబడిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
దీన్ని చూస్తే.. షాక్ తినాల్సిందే. నడి రోడ్డు మీద జనం గుమిగూడి ఉన్న చోట.. ఒక వ్యక్తిని ఒక అమ్మాయి ఎగిరెగిరి కొడుతున్న తీరు చూస్తే.. ఆ వ్యక్తి ఏదో చేయరాని తప్పు ఏదో చేసి ఉంటారన్నట్లుగా సీన్ కనిపిస్తుంటుంది. నిజంగా ఏం జరిగింది? అసలీ రచ్చకు మూలం ఏమిటి? అన్న లోతుల్లోకి వెళితే.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి.
సీన్ 1
లక్నో లోని అవద్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఒక క్యాబ్ డ్రైవర్ ను కారులో నుంచి బయటకు లాగి మరీ..ఒక అమ్మాయి కొడుతోంది. కాలర్ పట్టుకొని ఆగ్రహంతో ఊగిపోతోంది. ఆమెను ఆపటానికి ప్రయత్నించిన వారికి సైతం దెబ్బలు తప్పలేదు. చివరకు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం చేష్టలుడిగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇక.. సదరు క్యాబ్ డ్రైవర్ అయితే.. తనను రక్షించటానికి ఎవరైనా మహిళా పోలీసుల్ని పిలవాలని అభ్యర్థించాడు.
సీన్ 2
ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద ఆ మహిళ ఎందుకు అంతలా కొడుతోంది? అతడు చేసిన తప్పేంటి? ఒక అమ్మాయి అంత వైల్డ్ గా రియాక్టు అయ్యిందంటే కచ్ఛితంగా ఆమెకు జరగటానికి నష్టం ఏదో జరిగి ఉంటుంది. ఆమెతో గేమ్స్ ఆడిన మగాడికి సరైన రీతిలో బుద్ధి చెప్పిందన్నట్లుగా రోడ్డు మీద నిలబడిన వారు జోక్యం చేసుకునే కంటే కూడా.. చోద్యం చూసేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించారు. ఇంతకూ ఈ గొడవ జరగటానికి దారి తీసిన పరిణామాలేంటి? నిజంగా అంతకు ముందేం జరిగింది?
సీన్ 3
నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఒక అమ్మాయి అంత దారుణంగా కొడుతుండటం.. తిట్టి పోస్తుండటం సంచలనమైంది. ఇంతకూ అంతటి ఆగ్రహానికి కారణమేంటని పోలీసులు సీసీ కెమేరా ఫుటేజ్ ను చెక్ చేశారు. ఈ సందర్భంగా వారికి షాకింగ్ నిజాన్ని గుర్తించారు. నడి రోడ్డు మీద చెలరేగిపోయిన ఆ యువతిదే తప్పంతా అన్న విషయాన్ని గుర్తించారు. అవద్ సిగ్నల్ వద్ద వాహనాల రాకపోకలతో హడావుడి ఉంది. ఇలాంటి వేళలో రోడ్డు దాటేందుకు ఒక యువతి వడివడిగా నడుస్తోంది. రోడ్డు దాటే చివరలో ఒక కారు రావటం..ఆమెను ఢీ కొట్టకుండా సడన్ బ్రేక్ వేయటం జరిగింది.
ఆమెకు ఎలాంటి దెబ్బ తగలకపోవటమే కాదు.. కారు ఆమెను టచ్ చేయలేదు కూడా. కానీ.. ఆ యువతి మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. కారు డ్రైవర్ వద్దకు వెళ్లి.. డోర్ తీసి మరీ అతడి చొక్కాను పట్టుకొని కడిగిపారేయటం షురూ చేసింది. నోటికి పని చెప్పిన ఆ యువతి.. ఆవేశంతో చేతికి పని చెప్పింది. ఆ క్యాబ్ డ్రైవర్ పై అనుచిత రీతిలో దాడి చేసింది. జరుగుతున్న దాన్ని అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జరుగుతున్న దాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేశారు.
సీన్ 4
క్యాబ్ డ్రైవర్ పై అనవసరంగా దాడి చేయటమే కాదు.. వారిని విడదీసి.. సర్ది చెప్పటానికి ప్రయత్నించిన వ్యక్తికి దెబ్బలు తప్పలేదు. పోలీసు కానిస్టేబుల్ ను సైతం ఎదిరించి.. అతడిపైనా దాడి చేసేంతలా చెలరేగిపోయిన ఆ లక్నోయువతిని వెంటనే అరెస్టు చేయాలన్నది ఇప్పుడు డిమాండ్ గా మారింది. అమ్మాయి అయితే మాత్రం.. తప్పు చేయకున్నా కొట్టేయొచ్చా? అలాంటిదే ఎవరైనా యువకుడు చేస్తే పోలీసులు ఊరుకుంటారా? వెంటనే అరెస్టు చేస్తారు. మరి.. అలాంటప్పుడు లక్నో రోడ్డు మీద రచ్చ రచ్చ చేసిన ఆమెను మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? వెంటనే ఆమెను అరెస్టు చేయాలి. అస్సలు మొహమాటానికి పోవద్దంటూ నెటిజన్లు కోరుతున్న వైనం సంచలనంగా మారింది. మరి.. తప్పు చేయని క్యాబ్ డ్రైవర్ ను చేయి చేసుకోవటం తప్పే అవుతుందని.. సదరు యువతిని అరెస్టు చేయాల్సిందేనని చెబుతున్నారు. ఈ వీడియో మొత్తం చూస్తే.. మీరు కూడా ఆమెను అర్జెంట్ గా అదుపులోకి తీసుకోవాలనే చెబుతారు.