ఏపీలో సీఎం జగన్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, ప్రశ్నించేది ప్రజలైనా లేక ప్రతిపక్షమైనా అణచివేస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిని బలవంతంగా అణచివేయడం కుదరకపోతే అరెస్టు చేయడం జగన్ పాలనలో నిత్యకృత్యమైంది. ఇప్పటికే నెలనెలా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలందించేందుకు నానా తిప్పలు పడుతోన్న జగన్…జీతం మహాప్రభో అని అడిగిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఈ క్రమంలోనే తమ జీతాల కోసం మంగళగిరిలో నిరసన తెలుపుతున్న మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుధ్య కార్మికులపై జగన్ పోలీసులను ప్రయోగించారు. శాంతియుతంగా తమ జీతాలు చెల్లించాలని ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు ఈడ్చుకువెళ్లిమరీ అరెస్టు చేశారు. మహిళలను పురుషులైన పోలీసు సిబ్బంది కర్కశంగా ఈడ్చుకుంటూ వెళ్లి మరీ జీపులో కూర్చోబెట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ అరెస్టు ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ మండిపడ్డారు.
మున్సిపల్ కార్మికులను అరెస్ట్ ను లోకేశ్ తీవ్రంగా ఖండించారు. 5 నెలలుగా జీతాలు రావడం లేదని నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసి జైలుకి పంపడం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట అని లోకేశ్ నిప్పులు చెరిగారు. కార్మికులను దొంగల్ని పెట్టినట్టు లాకప్ లో బంధించడం జగన్ సర్కార్ దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. మున్సిపల్ కార్మికులవి జీతం వస్తే కానీ పూట గడవని జీవితాలని, 5 నెలల జీతం రాకపోతే కడుపు మండదా? అని ప్రశ్నించారు.
నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? అని ప్రశ్నించారు. 4రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేసినా పట్టించుకోలేదని, వారి సమస్యలు వినేందుకు ఉన్నతాధికారులకు మనస్సు రాలేదని మండిపడ్డారు. తక్షణమే వారి బకాయి జీతాలు చెల్లించి అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు.