మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టు వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఉమ అక్రమ అరెస్టును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉమపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను, దాడి చేయించిన వైసీపీ నేతలను వదిలేసి ఉమపై కేసుపెట్టి అరెస్టు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని, దేవినేని ఉమా ప్రాణాలకు హాని ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని, రాబోయే రోజుల్లో ఊరికొక రౌడీ వస్తాడని చంద్రబాబు అన్నారు. ఉమను కాపాడాలని డీజీపీకి లేఖ రాశానని చంద్రబాబు చెప్పారు. ఎందరో డీజీపీలను తాను చూశానని, కానీ, సవాంగ్ వంటి డీజీపీని చూడలేదని, లా అండ్ ఆర్డర్ విషయంలో సవాంగ్ లా మరెవరు ఇంత నిర్లక్ష్యం వహించలేదని విమర్శించారు.
ఉమ పై అక్రమ కేసులు బనాయిండచడం దారుణం, దుర్మార్గమని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ నేతలే ఉమపై దాడి చేసి..ఉమపైనే రివర్స్ కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. ఉమ పైన హత్యాయత్నం కేసు పెట్టడానికి ప్రభుత్వానికి సిగ్గుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉమ ఏం తప్పు చేశారని, ఆయనను 8 గంటలపాటు కారులోనే ఉంచారని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలు రాళ్లేస్తే పారిపోయే పిరికిపందలం కాదని సవాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను జగన్ నిర్వీర్యం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.
కాగా, తన భర్త దేవినేని ఉమకు ప్రాణహాని ఉందని ఉమ భార్య అనుపమ ఆందోళన వ్యక్తం చేశారు. ఉమకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్ర హోంమంత్రి సుచరితకు అనుపమ లేఖ రాశారు. ప్రజా జీవితంలో ఉమ చాలా క్రియాశీలకంగా ఉన్నారని, అక్రమ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉమను మైనింగ్ మాఫియా, గూండాలు లక్ష్యంగా చేసుకున్నారని, ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు.