జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఆగస్టు 25 వరకు న్యాయం కోరుకునే వారంతా ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందేనని రఘురామ అన్నారు. తమ వాదనలన్నీ వినిపించామని, రాతపుర్వకంగా ఇచ్చామని అన్నారు.
నెల క్రితం ఉన్న పరిస్థితినే సీబీఐ అంగీరకరించినందుకు సీబీఐకి రఘురామ ధన్యవాదాలు తెలియజేశారు. అందరం ఆశావాదంగా ఉందామని, నిరాశ చెందవలసిన అవసరం లేదని రఘురామ చెప్పారు. మరోవైపు, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు పారిపోయేందుకు A2 చూస్తున్నారని ఎద్దేవా చేశారు. మరో రెండు రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని పిటిషన్ వేయబోతున్నట్టు బాంబు పేల్చారు రఘురామ.
అంతకుముందు, జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై వాయిదాలు ఇవ్వకూడదని గట్టిగా కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు రఘురామ తరఫు న్యాయవాది వెంకటేష్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే జూన్ 1న వేసిన మెమోను రికార్డులోకి తీసుకోవాలని సీబీఐ కోర్టుకి చెప్పిందని వెల్లడించారు. కోర్టు మరోసారి గడువు ఇవ్వక పోయేసరికి ఇలా చేశారని అన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 25న ఆర్డర్ పాస్ చేస్తున్నట్లు కోర్టు తెలిపిందన్నారు. 2017లో సీబీఐ స్వయంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరిందని, ఇపుడు తటస్థంగా ఉండడం సరైందికాదని అభిప్రాయపడ్డారు.
సీబీఐ తటస్థంగా ఉండడంతో జగన్ సాక్షులను ప్రభావింతం చేస్తారన్న తమ వాదనలకు బలం చేకూరినట్టు భావించాలన్నారు. తమ వాదనలలో నిజం లేకపోతే సీబీఐ కచ్చితంగా వ్యతిరేకించేదని చెప్పారు. ఆగస్టు 25న బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుందని వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. అదేరోజు తీర్పు వెలువడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.