కాస్త ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలనే ఇప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓటీటీలు బాగా అలవాటైపోయి థియేటర్లకు రావడం తగ్గించేస్తున్నారు. అలాగని ఓటీటీల్లో కూడా అందుబాటులో ఉన్న ప్రతి సినిమానూ చూసేయడం లేదు.
బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉండటంతో చాలా బాగుంది అన్న టాక్ ఉన్న సినిమాలనే ఎంచుకుని చూస్తున్నారు. ప్రపంచ సినిమాతో పాటు ఎన్నో భాషల్లో వెబ్ సిరీస్‌లు బోలెడన్ని అరచేతుల్లోకి అందుబాటులోకి వచ్చేసిన ఏం చూడాలనే విషయంలో ప్రేక్షకులకు చలా సెలెక్టివ్‌గా ఉంటున్నారు.
ఇలాంటి సమయంలో వారి దృష్టిని ఆకర్షించి ఒక సినిమా చూపించడం అన్నది కష్టమైపోతోంది. టీవీలో కాస్త ఫేమ్ వచ్చింది కదా అని హీరోలైపోతే ప్రేక్షకులు వాళ్లను నెత్తిన పెట్టుకోవట్లేదు. ‘జబర్దస్త్’లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా మారితే ఎవరూ పట్టించుకోలేదు. అతడి టీం మెంబర్లు గెటప్ శీను, రాం ప్రసాద్‌లతో కలిసి సినిమా చేస్తే అదీ తుస్సుమంది.
వీళ్లు కాక ‘బిగ్ బాస్’తో పాపులారిటీ వచ్చిందని అందులోని పార్టిసిపెంట్లు ఒక్కొక్కరుగా హీరోలైపోతున్నారు. సినిమాలు చేసేస్తున్నారు. ఇప్పటికే సోహెల్ హీరో అయ్యాడు. అతను ఒకటికి రెండు సినిమాలు చేస్తున్నాడు. అలాగే అఖిల్ కూడా హీరోగా మారిపోయాడు. వీళ్లిద్దరూ లుక్స్ పరంగా కొంచెం బెటరే.
కానీ ఇప్పుడు ఏకంగా మెహబూబ్ సైతం హీరో అయిపోవడం విచిత్రం. అతను హీరోగా ‘గుంటూరు మిర్చి’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం బాడీ పెంచి చాలానే కష్టపడ్డట్లున్నాడు మెహబూబ్. ఆ బాడీ చూపిస్తూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. ఐతే మెహబూబ్ ఏవో కామెడీ వేషాలేసుకుంటే ఓకే కానీ.. మరీ హీరో అయిపోవడం, గుంటూరు మిర్చి అంటూ మాస్ టైటిల్ పెట్టుకుని బాడీ చూపిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం అతిగా అనిపిస్తోంది.
బిగ్ బాస్‌తో వచ్చిన పాపులారిటీ వేరు. దాన్ని అనుసరించి సినిమాలు చేసేయడం వేరు. ‘బిగ్ బాస్’ విన్నర్లుగా నిలిచిన శివబాలాజీ, కౌశల్, అభిజిత్ లాంటి వాళ్లకే సినిమాల్లో ఏం సాధించింది లేదు. మరి మెహబూబ్ లాంటి వాళ్లు ఏం సాధిస్తారో చూడాలి.