ఏపీ సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను, జగన్ పాలనను రఘురామ తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ఇరకాటంలో పడేస్తున్న వైనం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై ఆర్ఆర్ఆర్ తన మార్క్ కామెంట్లతో, సెటైర్లతో విరుచుకుపడ్డారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి జన బాహుళ్యంలోకి రావాలని చురకలంటించారు.
రూపాయి జీతం తీసుకొనే జగన్…తన హెలికాప్టర్ కోసం అవుతున్న రూ.26 కోట్ల ఖర్చును తగ్గించుకుంటే మంచిదని రఘురామ హితవు పలికారు. ఇంకా, జగన్ చాయ్, బిస్కట్ల కోసం పెడుతున్న రూ.8 కోట్ల ఖర్చును తగ్గించుకుంటే ఇంకా మంచిదని సెటైర్లు వేశారు. రూపాయి జీతానికి బదులు పూర్తి జీతం తీసుకొని ఆ హెలికాప్టర్, టీ, బిస్కెట్ల ఖర్చును తగ్గించాలని రఘురామ సూచనలిచ్చారు. రూపాయికే పేదలకు ఇళ్లు కడతానని జగన్ చెప్పడం సంతోషకరమని, కానీ, ఆచరణలో పెట్టాలని ఆర్ఆర్ఆర్ చురకలంటించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనసు చేసుకొని ఇళ్ల నిర్మాణం ప్రారంభించడం సంతోషకరమైన విషయమని రఘురామ అన్నారు. కానీ, ఇళ్ల నిర్మాణానికి ఓపెనింగ్ లు, రీ ఓపెనింగ్ లు, రీరీ ఓపెనింగ్ లతో కాలయాపన చేస్తున్నారని, కానీ, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం లేదని ప్రజలు బాధ పడుతున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. ఇళ్ల విషయంలో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటే ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. తమకు అన్యాయం జరిగితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. సీజేఐ రమణ మాతృభాషలో విచారణ జరపడం సంతోషకరమని, మాతృభాషలో వచ్చే స్పందన పరాయిభాషలో రాదని అన్నారు.