జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ.. వాటికి సాక్ష్యాలు చూపిస్తానంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ చేపట్టిన కార్యక్రమం అనుకోని మలుపులు తిరగటం.. చివరకు ఆయన్ను రిమాండ్ కు వెళ్లేలా చేసింది. ఆయనపై తీవ్ర అభియోగాలతో కోర్టు ముందు హాజరుపర్చగా.. పద్నాలుగు రోజుల రిమాండ్ ను విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఆయన్ను జైలుకు పంపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన్న తరలిస్తున్నారు.
తాను ప్రాతినిధ్యం వహించే మైలవరం నియజకవర్గం పరిధిలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని టీడీపీ విమర్శలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాల్ని చూపిస్తామని దేవినేని ఉమ తీసుకెళ్లటం.. అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు కొందరు ఆయన తీరును తప్పు పడుతూ నిరసన చేపట్టటం తెలిసిందే. ఈ ఉదంతం అంతకంతకూ ముదిరి.. అధికార.. విపక్ష నేతల మధ్య దాడులు చేసుకునే వరకు వెళ్లింది.
మరోవైపు ఈ ఉదంతం గురించి వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగులో ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తోందని.. అక్కడ మెరకను చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. కానీ.. అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారని అసత్యపు ప్రచారం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయటంతో దానిపై అక్కడి ప్రజలు అభ్యంతరం చెప్పారని.. ఇదే ఉద్రికత్తకు కారణమని చెబుతున్నారు.
రెండు పక్షాల వాదన ఎలా ఉన్నా.. తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితుల్ని సద్దుమణిగేలా చేయటంలో పోలీసులు విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. ఉద్రిక్త నివారణ కోసం దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం భారీగా శ్రమించాల్సి వచ్చింది. ఆయన కారు అద్దాల్ని బ్రేక్ చేసి మరీ ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.
అదుపులోకి తీసుకున్న దేవినేని ఉమను ఆన్ లైన్ పద్దతిలో న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి జూమ్ యాప్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. దేవినేని ఉమతో పాటు డ్రైవర్ ప్రసాద్.. తెలుగు యువత నేత లీలా ప్రసాద్ కు కూడా రిమాండ్ విధించారు. వారందరిని రాజమండ్రి జైలుకు తరలించారు.